జీవిత కథలు - 6





ఇది ఒక యువకుడి మనోభావం మాత్రమే. 


"ఛీ దీనమ్మ జీవితం, మరీ వెధవ బానిస బ్రతుకయిపోయింది రా" మొన్నొకసారి తాగిన మత్తులో నా స్నేహితుడి మనసు లోతుల నుండి వచ్చిన ఈ మాట, అమెరికాలో బ్రతికేస్తున్న నాలో ఆలోచన రేకెత్తేలా చేసింది.

నిజమే సార్ మీరనుకుంటున్నది, మమ్మల్ని ఎవరూ అమెరికా వెళ్ళమని బ్రతిమిలాడలేదు. మా అంతట మేమే, పూర్తి జ్ఞానంతో, ఆనందంగా, అన్ని ఆలోచించుకొనే వచ్చాము. 

డబ్బు మీద వ్యామోహంతో కొందరం, అమెరికా మీద మోజుతో కొందరం, ఇండియా నచ్చక కొందరం...  కారణం ఏదైనా కానీయండి సార్, వచ్చేసాం.

ఇంకొంతమంది అమ్మాయిలైతే కేవలం పెళ్లి నుండి తప్పించుకోడానికి వచ్చిన వారే సార్. 

ఒప్పుకుంటాను సార్, అందరూ ఇవే కారణాలతో రాలేదు, ఫ్యామిలీ కోసం కొందరు, నిజంగా కెరీర్ లో ఉన్నత స్థానం సాధించడానికి కొందరు వచ్చారు, కానీ ఎంత మంది ఈ కారణాలతో వచ్చారో మనందరికీ బాగా తెలుసు సార్. 

వచ్చేసేముందు చాల సంతోషంగా ఉండేవాళ్ళం సార్, నిజంగా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం.

ఏదో కొత్త ప్రదేశానికి వెళ్తున్నాం. అమెరికా మొత్తం తిరిగేస్తాం. డాలర్లు సంపాదించేస్తాం. ఖరీదైన ఫోన్లు, అందమైన కార్లు... ఓహో ఆ ఊహాచిత్రమే చాలా అందంగా ఉండేది.

కానీ,  హైద్రాబాద్లో విమానం ఎక్కే ముందు ప్రతీ ఒక్కడు... 'ఇది నాకు అవసరమా ? అమ్మ, నాన్న, కుటుంబం, దేశం... వీటన్నిటిని వదులుకొని ఎం సాధించడానికి వెళ్తున్నాను ?' అని ప్రశ్నించుకున్నవాడే సార్, అంతలోనే 'అమ్మో... ఇంత డబ్బు ఖర్చుపెట్టినపుడు వెళ్లిపోవాలని కదా' అని ధైర్యం తెచ్చుకుంటాడు. 

వచ్చిన తరువాత, ఇక్కడ సినిమానే వేరు సార్... అప్పటి వరకు అమ్మ అందంగా సర్దిపెట్టే ఇంటిని చూస్తామేమో... ఒక్క సారి ఇక్కడ చిత్రం చూసేసరికి, దానమ్మ...  ప్రతి ఒక్కడికి అమ్మ గుర్తొస్తుంది.

ఆకలేసి అన్నం తినాలంటే, ఆల్రెడీ ఉన్న అంట్లు తోమాల్సొస్తుంది సార్. సరే కదా తోమేద్దామని మొదలుపెడతాం, అవి తోమేసరికి ఆకలి మొత్తం ఎగిరిపోతుంది.

మనం ఇంట్లో ఎక్కువగా వాడని మైక్రో-వేవ్ ఓవెన్లు లేకపోతే రోజు గడవదు సార్ ఇక్కడ. నిన్న మొన్నటి ఫుడ్ అంటే ఎంతిష్టమో మాకు.

కేవలం వేడన్నం తింటున్నందుకు ఎక్సైట్ అయ్యే రోజులు కూడా చాలానే ఎదురుపడతాయి సార్.

చెప్తే నమ్మరు గాని, అన్నం తింటున్నప్పుడు కన్నీళ్లు కార్చిన అద్భుతమైన సందర్భాలు కూడా ఉన్నాయి సార్.

జ్వరమొస్తే 'రేయ్ టాబ్లెట్స్ వేసుకో' అని చెప్పేవాళ్ళే తప్ప, కనీసం నుదిటిమీద చెయ్యిపెట్టి చూసేవాళ్ళే దొరకరు. కొన్ని సందర్భాలలో ఆ టాబ్లెట్స్ కూడా ఉండవు, వెళ్లి తెచ్చుకుందామంటే, అదొక యజ్ఞం. దానికన్నా ఇంట్లో దుప్పటి కప్పుకొని ఒక రోజు పడుకుంటే అదే తగ్గిపోతుందిలే అనే నిర్ణయానికి వచ్చేస్తాం.

ఒక సినీ కవి చెప్పినట్టుగా, ఇక్కడంతా 'నేసీసీటీ అఫ్ లివింగ్' సార్, అంటే ఎవడి బ్రతుకు వాడు బ్రతకడమే. 

కొన్ని సార్లు క్లాసుకి వెళ్లాలంటే, మైనస్ డిగ్రీల చలిలో ఎంతో దూరం నడవాల్సొస్తుంది సార్. కానీ తప్పదు. మనం వచ్చిందే చదుకోడానికి కదా.

పక్క వీధికి వెళ్ళటానికి వెంటనే బైక్ తీసేసిన మేము, ఎక్కడో మైలు దూరం వెళ్లాల్సొస్తే, ఉబర్ కి ఏడెనిమిది డాలర్ల ఖర్చు అనవసరమని నడుచుకుంటూ వెళ్ళిపోతాం సార్.

లేదు సార్, మాకు అస్సలు ఇబ్బందిగా ఉండదు... ఇయర్ ఫోన్స్ లో మన తెలుగు పాటలు ఉన్నాయి కదా.

'లేదురా, చాల ఇబ్బంది పడుతున్నామ'ని తెలుసుకొని ఎలాగైనా కారు కొనాలని ధృడంగా నిశ్చయించుకుంటాం. దానికోసం, అక్కడ ఇక్కడ పని చెయ్యటం, ఆ పనుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది సార్.

తెలుగు సినిమా వస్తే చాలు, పాతిక డాలర్ల పెట్టి రెండున్నర గంటల సినిమా చుసేసోస్తాం. కానీ ఆ పాతిక డాలర్లు మా మూడున్నర గంటల కష్టం సార్. ఇంకొంతమందైతే మరీ గొప్పోళ్ళు సార్, సినిమా చూసి, బిర్యానీ తినొచ్చు కదా అని అయిదారు గంటలు ప్రయాణం చేసి పక్కనే ఉన్న పెద్ద సిటీకి పోతారు. మొత్తం రాను... పోను... సినిమా... బిర్యానీ... అన్ని కలిపి తడిచి మోపెడవుతుంది.  అయినా పర్లేదు, సినిమా ప్రేమికులం, తెలుగుని అభిమానించేవాళ్ళం మేము.

ఇక ఇండియా వస్తున్నారంటే, ఎవరిని నిరాశ పరచకుండా ఏదోకటి తీసుకొస్తూనే ఉంటాం సార్. దాని కోసం ఇంకొన్ని ఎక్కువ రోజులు పని చెయ్యటానికి కూడా సిద్దపడతాం. మాకు మా కుటుంబం, మా స్నేహితులు అంతిష్టం సార్.

చదువు, ఉద్యోగం, ఇంటి పని, వంట పని ఇలా ఒక్కటీ కాదు సార్. అప్పటి వరకు దర్జాగా నాన్న జేబులో డబ్బులు తీసుకోని సిగెరెట్ కాల్చేసొచ్చిన మాకు, సడన్ గా చాల బాధ్యత వచ్చేస్తుంది.

బావుంది సార్, కష్టం తెలుసుకున్నాం, బాధ్యత తెలుసుకున్నాం...

అమ్మ మమ్మల్ని ఎంత కష్ట పడి పెంచిందో తెలుసుకున్నాం,
నాన్న ఎంత బాధ్యతతో పెంచాడో తెలుసుకున్నాం

తెలుసుకొని, ఇంటికి డబ్బులు పంపించి, కష్టం తెలుసుకున్నాం, బాధ్యత తెలుసుకున్నామని మాకు మేమే ఆనందపడిపోతాం సార్.

కానీ సార్, బాధ్యత అంటే ఇంటికి డబ్బులు పంపిచటమేనా ?

ఇప్పటికీ వాళ్ళకే  కష్టమొచ్చినా చెపితే మేమెక్కడ బాధపడతామోనని చెప్పకుండా దాచేస్తున్నారని తెలుసుకోలేకపోతున్నాం సార్.

కానీ సార్, ఇదే కష్టం ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు కదా... ఈ కష్టం, బాధ్యత తెలుసుకోడానికి పాతిక లక్షలు అప్పుందని తెలుసుకోవాలా సార్ ?

సరే, ఏదైతేనేం తెలుసుకున్నాం, ఏదో తంటాలు పడి ఉద్యోగం తెచ్చుకొని, అప్పు తీర్చి ఇండియా వచ్చేయాలనే ఉంటుంది సార్ మాలో చాల మందికి. ఇప్పుడు ఆ భాగ్యం కూడా లేనట్టే కనపడుతుంది. 

ఏమైనా, దేనికీ భయపడం సార్, బాధపడం, అధైర్యపడం... ఉద్యోగం వచ్చేంత వరకు, కన్సల్టెన్సీ వాడు ఇచ్చిన రూము, పెట్టె తిండి నచ్చకపోయినా, ఉద్యోగం లేనిదే ఇండియా రావడానికి ఇష్టపడం.

డబ్బులు చాలక క్రెడిట్ కార్డులలో అప్పులు పెరిగిపోతున్నా, ఇంటి నుండి డబ్బులు తెప్పించుకోడానికి సిద్ధపడం.

ఏదేమైనా, జీవితం తెలుసుకున్నాం సార్. కానీ మా కర్మేంటంటే తెలుసుకున్నామని చెపుతున్నా, ఇండియాలో బాధ్యత లేకుండా తిరిగామని బాధపడుతున్నా, జీవితం రోజు నేర్పించిన పాఠమే నేర్పిస్తుంది సార్.

పదే పదే అదే పాఠం నేర్చుకుంటున్నాం, అదే కన్నీళ్లు కార్చి పడుకుంటున్నాం.

ఇండియాలో మా మీద అభిప్రాయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి సార్, కోట్లు సంపాదన... చుట్టూ అమెరికన్ అమ్మాయిలు... లగ్జరీ కార్లు, బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన ఫోన్లు... ఇవే కనపడుతాయి సార్. ప్రతి దాని వెనుకాలా అంతకన్నా ఎక్కువ విలువైనా కన్నీళ్లు ఉన్నాయని ఎవరికీ తెలియదు సార్. మేము తెలియనివ్వం కూడా.

అమెరికా వచ్చినా, అమ్మ ప్రేమని... ఆవకాయ రుచిని... అగరొత్తుల పరిమళాన్ని మరిచిపోలేకపోతున్నాం సార్.

దరిద్రమేంటంటే మర్చిపోలేకపోతున్నామని తెలిసి ఫేస్ టైంలోనో, స్కైప్ లోనో అమ్మతో మాట్లాడగలుగుతున్నాం గాని, అమ్మ ఒళ్ళో తలపెట్టుకొని పడుకోలేకపోతున్నాం సార్, అలా చెయ్యాలనిపించినా ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నాం సార్.

ఇంత సేపు ఓపికగా విన్నారు. చాల థాంక్స్.



                                                                                         ఇట్లు 
అమెరికాలో ఉంటున్న ఒక తెలుగబ్బాయి