జీవిత కథలు - 8


"వద్దు భరత్, నీ మీద చాల అంటే చాల నెగటివ్ ఒపీనియన్ కలుగుతుంది. ఇంకా ఎక్కువ చేసుకోకు" కోపంగా మాట్లాడింది ఐశ్వర్య. 
"అంత కోపం తెచ్చుకోకు ఐషు, నేను వెళ్ళిపోతాను, వదిలి వెళ్ళిపోతాను" భాదతో బదులిచ్చాడు వరంగల్ ఫ్రూట్ మార్కెట్ బయటకి వస్తున్న భరత్. 
"థాంక్యూ, నన్ను అర్ధం చేసుకున్నందుకు" 

చిరాకులో వస్తున్నాయి ఐశ్వర్య మాటలు. 

ఫ్రూట్ మార్కెట్ బయటనే పార్క్ చేసి ఉన్న, తన బైక్ దగ్గరకొచ్చి మౌనంగా నిల్చుండిపోయాడు  భరత్. 

"గుర్తుపెట్టుకో, నేను నీకు గర్ల్ ఫ్రెండ్ ని కాదు, ఇంకేమి కాను. నువ్వు అబద్ధంలో బ్రతకడం నచ్చలేదు నాకు" గట్టిగా చెప్పేసింది రెట్టించిన గొంతుతో. 
"టేక్ కేర్, ఐశ్వర్య" ఆఖరి మాట మాట్లాడేసి కాల్ కట్ చేసేసాడు భరత్. 

'నువ్వు అబద్ధంలో బ్రతకడం నచ్చలేదు నాకు' 
'నువ్వు అబద్ధంలో బ్రతకడం నచ్చలేదు నాకు' 
'నువ్వు అబద్ధంలో బ్రతకడం నచ్చలేదు నాకు' 

అదే మాట పదే పదే భరత్ ని కలచివేస్తుంది. తట్టుకోలేని మాట అది. ఐశ్వర్య క్షణికావేశంలో అనేసిందో లేక అలోచించి మాట్లాడిందో తెలుసుకోలేకపోతున్నాడు. తనలో తానె సతమతమవుతున్నాడు. ఆఖరి సారిగా ఒక్క మాట మాట్లాడాలని మెసేజ్ చెయ్యటానికి ఫోన్ తీసాడు. 

"సారీ ఐశ్వర్య, నేనేమయినా తప్పు చేసుంటే" ఆఖరి మెసేజ్ పంపుదామని నిర్ణయించుకొని పంపించేశాడు. 

"నేను చెప్పేది వినకుండా, నీకు నువ్వు నీ వైపునుండి ఆలోచిస్తూ ఉంటావు. అది కరెక్ట్ కాదు"
"ఇష్టం ఐషు. చాల ఇష్టం. నేనేమైన తప్పు చేసుంటే క్షమించు. మర్చిపో అంతా"
"నాకు మనసు బాగోలేకపోతే నేను మాట్లాడలేనని, పనీ పాట లేక చెప్తున్ననుకున్నావా ? ఆ రోజు నేను మాట్లాడలేను నా మనసేం బాగోలేదని కూడా చెప్తానే ఉన్నాను. నేను మాట్లాడలేను అంటున్నా ఎందుకు వినవు నువ్వు."
"మార్చుకుంటా ఐశ్వర్య, నన్ను నేను మార్చుకుంటా... ఇక పై ఇబ్బంది పెట్టను నిన్ను. కాల్ చెయ్యొద్దు అన్నపుడు చెయ్యకూడదు. మాట్లాడొద్దు అన్నపుడు మాట్లాడకూడదు. వదిలేయమన్నపుడు ఒంటరిగా వదిలేయాలి  అంతేనా?" భరత్ కళ్ళలో కన్నీరు మెసేజ్ టైపు చేస్తున్నంతసేపు. 
"వదిలే, నీకు అర్ధం కాదులే చెప్పినా" కచ్చితంగా చెప్పేసింది ఐశ్వర్య. 
"క్షమించు నన్ను, నిజంగా నేను తప్పు చేసుంటే. క్షమించు" భరత్ భాద, దుఃఖంగా మారింది. 
"ఇది మొదటిసారి కాదు నువ్విలా చెయ్యటం. అయినా క్షమించు అనేది చాల పెద్ద విషయం. మనకక్కర్లేదు అనుకుంట"
"నేను నిన్ను అంత హర్ట్ చేస్తున్నానుకోలేదు ఐశ్వర్య"
"హర్ట్ చేస్తున్నవానట్లేదు, నువ్వు వినవు నేను చెప్పేది అంటున్న"
"నువ్వు దేనికి హర్ట్ అవ్వకూడదు ఐషు,  దేనికి భాదపడకూడదు, ఏడ్చే స్టేజి కి వెళ్ళకూడదు. చాల సార్లు చూసాను ఇలాంటి స్టేజెస్ లో నిన్ను. నీతో మాట్లాడితే నార్మల్ అవుతావనే మాట్లాడతాను. నీ నవ్వు నాకు చాల ఇంపార్టెంట్ ఐషు. దానికోసం ఏమైనా చెయ్యాలనుకుంటాను. తిట్టాలనిపిస్తే తిట్టు, కొట్టాలనిపిస్తే కొట్టు"
"నాకు చిరాకేసింది అందుకే అలా అన్నాను" కాస్త కోపం తగ్గింది ఐశ్వర్యాలో. 
"నువ్వు నా మీద ఎన్ని సార్లు కోపం తెచ్చుకున్నా, అన్ని సార్లు సారీ చెప్పటానికి కూడా ఆలోచించను. కోపం ఈరోజుంటుంది, రేపు పోతుంది. కానీ ద్వేషం ఒక్కసారి వస్తే పోతుందనే నమ్మకం నాకు లేదు"

ఐశ్వర్య ఏమి మాట్లాడలేకపోయింది. భరత్ మాత్రం ఐశ్వర్య మెసేజ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. 

ఇంటి నుండి కాల్ రావటంతో, బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయల్దేరాడు. 

కొంచం ముందుకొచ్చి, సుబ్రహ్మణ్యం బేకరీ దగ్గరున్న సర్కిల్ చుట్టూ తిరిగి, వెంకటరామ సినిమా టాకీస్ వైపు బైక్ తిప్పుతుండగా, అదే నరసరంపేట్ మీదగా వస్తున్న కారు, అదుపు తప్పి అటుగా వెళుతున్న భరత్ బండిని బలంగా గుద్దుకుంది. 

అంతే. సర్కిల్ దగ్గర కింద పడిన బైక్, పెద్ద శబ్దం చేస్తూ నేలని రాసుకుంటూ,  వంద మీటర్ల దూరంలో ఉన్న బస్టాప్ వరకు వెళ్ళిపోయింది. 

భరత్ కిందపడిపోవడం, శరీరమంతా గాయాలవ్వడం... స్థానికులందరు గుమిగూడడం క్షణాలలో జరిగిపోయింది. 

అదే సమయంలో భరత్ ఫోనుకి ఐశ్వర్య మెసేజ్ వచ్చింది. "వదిలేయ్ భరత్. అయిపోయింది కదా. ఏదో అనేశాను. సారీ"
  
కానీ అది చూసే పరిస్థితుల్లో గాని, దానికి స్పందించే స్థితిలోగాని భరత్ లేడు.


రెండు గంటల తరువాత. 


పరుగు పరుగున భరత్ ఉన్న హాస్పిటల్ రూంలోకి వచ్చింది ఐశ్వర్య. కళ్ళలో దుఃఖం, గుండెల్లో భాద, ఒళ్ళంతా వణుకుతూ. 

బెడ్ మీద ఒళ్ళంతా గాయాలతో పడుకున్న భరత్ ని చూసి చలించిపోయింది. కాళ్ళు చేతులు ఆడటం లేదు ఐశ్వర్యకి. ఒక్కసారైనా భరత్ తో మాట్లాడాలని చాల తాపత్రేయపడింది. కానీ భరత్ మాట్లాడే స్థితిలో లేడు. 

బెడ్ పక్కనే స్పృహ కోల్పోయి నేలకొరిగింది ఐశ్వర్య. 


*** ***

ఈ సన్నివేశం చోటు చేసుకొని రెండేళ్ళకి పైనే అవుతుంది. భరత్ కు ఆ యాక్సిడెంట్ నుండి కోలుకోవడానికి నాలుగు నెలలు పట్టింది. 

ఇప్పుడు భరత్ పూర్తి ఆరోగ్యాంగా ఉన్నాడు. మా ఇద్దరికీ పెళ్లి జరిగి, ఒక పాపతో చాల సంతోషంగా ఉన్నాము. 

మనల్ని ప్రేమించే వారు, మనకెంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనం కొన్ని సందర్భాలలో గుర్తించలేకపోతం. అది మానవ నైజం. అమ్మ మన కోసం ఒక మంచి మాట చెప్తున్నప్పుడు, దానికి చిరాకు పడిన సమయం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఉంటుంది అలానే, నాన్న మన మంచి కోసమే ఏదైనా పని చెయ్యమన్నపుడు, విసుక్కున్న సందర్భాలు చాలానే ఉంటాయి. మనల్ని అమితంగా ఇష్టపడే వారు చెప్పిన మాటలు కూడా ఏదొక సమయంలో మనం విసుక్కునేలా చేస్తుంటాయి, కానీ మన ఆనందాన్ని పక్కనే ఉండి పంచుకున్న వారు, మన బాధను కూడా అలానే పంచుకోడానికి ప్రయత్నిస్తున్నారనే సత్యం గుర్తించలేకపోతాము. వాళ్ళ మీద చిరాకు పడతాం. కోపగించుకుంటాం. క్షణికావేశంలోనో, సహనం కోల్పోయో ఒక మాట విసేరేసే సందర్భాలు మన జీవితంలో చాలానే వస్తుంటాయి. కానీ ఆ మాట ఎదుటి వారిని ఎంత భాదపెడుతుందో మనకప్పుడు తెలియదు. తరువాత తెలిసి సరిదిద్దుకుంటారు కొందరు. కానీ నా భరత్ ని కంటికి రెప్పలా కాపాడుకునే రూపంలో నాకు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు. 
- ఐశ్వర్య 






ఆధారం: సంతకంకి వచ్చిన మెయిల్

మీ జీవితంలో జరిగిన కథలు గాని, మీరు తెలుసుకున్న కథలు గాని అందరితో పంచుకోవాలనుకుంటే... మీ కథని క్లుప్తంగా రాసి మాకు మెయిల్ చెయ్యగలరు.
మా మెయిల్ ఐడీ : santhakamofficial@gmail.com