జీవితం.. లైఫ్.. జిందగీ



జీవితం., లైఫ్., జిందగీ., 
పేరు ఏదైనా అర్ధం ఒక్కటే.
భాష ఏదైనా భావం ఒక్కటే.

కాలం కంటే వేగంగా పరిగెడుతున్న ఈ ప్రపంచంలో, 
జీవితం అనే మాటకి అర్ధం కూడా అంతే వేగంగా మారిపోతూ వస్తుంది. 

ఆ మారిపోతున్న అర్ధం
 ఒక రకంగా మనిషి సామాజిక ఎదుగుదలకి తోడ్పడుతున్నా,
మరొక వైపు అదే మనిషి మానసిక ఎదుగుదలని స్థంబింపజేస్తుంది.

ఇది తప్ప, లేక ఒప్ప అనే ప్రశ్న ఆలోచించే సమయం,
మనలో చాలా మందికి లేకపోవడం మన అదృష్టం.

ఒకవేళ మన ఈ మార్పు ఒప్పు అని చెపితే, 
ఎటువంటి ఇబ్బంది లేదు.

అదే మన ఈ మార్పు తప్పు అని సూచిస్తే,

ఇక్కడ తప్పు,
 పరిగెడుతున్న కాలానిదా?
 లేక 
మారిపోతున్న విలువలదా?

ఈ ప్రశ్నలకి సమాధానం దొరకక మనిషి ప్రతి రోజు సతమతమవుతున్నాడు.

ఇదే అందమైన ప్రపంచంలో,
అందమైన జీవితం గడుపుతున్నాను అనుకుంటున్నా మనిషి, 
ఎంత వరకు తనకి నచ్చిన అదే అందమైన జీవితాన్ని జీవిస్తున్నాడు?

మొన్నీమధ్యనే జరిగిన ఒక సర్వే ప్రకారం,
ఈ ప్రపంచంలో 70% మంది, తమకు ఆశపడిన జీవితాన్ని జీవించలేక,
పరిస్థితులకి సర్దుకుపోయి, 
ఒక మెకానికల్ బ్రతుకుని బ్రతికేస్తున్నారు.

అదే మన భారతదేశానికి వచ్చేసరికి, 
ఆ 70%, 95% అయింది.

అంటే మన దేశంలో ప్రతి 100 మందిలో అయిదుగురు మాత్రమే తమకు నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారు.

బంధాలు,  భాద్యతలు,  పరిస్థితులు,  అవసరాలు 
ఇలా మనకి మనం చెప్పుకునే కారణాలు ఎన్నున్నా,  

ఉదయం లేచిన దగ్గరనుండి, రాత్రి పడుకునేంత వరకు,
ఒక చక్రంలో తిరుగుతూ పరిగెడుతూనే ఉన్నాం.

"దీనమ్మ జీవితం"
"నచ్చింది చేయలేకపోతున్నాను"
"దీని నుండి ఎలా అయినా భయటపడిపోవాలి. కానీ"
ఇలాంటి మాటలు మనతో మనమే రోజు చెప్పుకుంటూ ఉంటాం.
చెప్పుకుంటూ మాత్రమే ఉండిపోతాం.

పరువు, ప్రతిష్ట, స్థాయి, హోదా 
అనే ఈ పదాలు,
మనలో ఆనందాన్ని నిజంగానే పెంపొందిస్తున్నాయా?

అనే ఒక్క ప్రశ్న తనకు తాను వేసుకున్నప్పుడు తన జీవితానికి నిజంగా ఒక అర్ధం దొరుకుతుంది.


ఉన్నదీ ఒక్కటే జీవితం.
నచ్చినట్టు బ్రతుకడమా? 
లేక 
నచ్చకపోయినా పరిస్థుతలకి సర్దుకుపోవడమా?

మనకి మనమే సమాధానం చెప్పుకోవాలి.