మన ఆచారాలు - వాటి కారణాలు (1)


ప్రస్తుతకాలంలో మూఢనమ్మకాలుగా పరిగణించబడుతున్న మన ఆచారాల వెనుక అర్ధం తెలుసుకునే ప్రయత్నమే ఈ మన ఆచారాలు సిరీస్. 



1. రెండు చేతులు జోడించి నమస్కరించడం 


మనం సాధారణంగా ఎవరినైనా కలిసినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, వాళ్ళ పట్ల మనకున్న గౌరవాన్ని తెలియజేస్తాం. కానీ అలా నమస్కారం చేసినప్పుడు, మన వేళ్ళు చివరన ఉన్న ప్రెషర్ పాయింట్స్  స్పృశించబడతాయి. ప్రెషర్ పాయింట్స్ స్పృశించడం ద్వారా జ్ఞానేంద్రియాలు అవయవాలు సంక్రియం(యాక్టీవెట్) చెయ్యబడతాయి.  తద్వారా ఆ మనిషిని ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. మనం ఎదుటివారి చెయ్యి పట్టుకోవటంలేదు కాబట్టి, క్రిమికీటకాలు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉండదు. 


2. రాగి నాణాలని నదిలోనికి విసరడం

ఎపుడైనా గోదావరి మీదనుండి ట్రైనులో వెళ్తున్నపుడు, ఎవరోఒకరు చిల్లర నాణాలను నదిలోనికి విసరడం మనం గమనిస్తూ ఉంటాం. అలా విసిరితే అదృష్టం వరిస్తుందని నానుడి. కానీ దాని వెనుక కూడా ఒక కారణం ఉంది. పూర్వం రాగి నాణాలు వాడుకలో ఉండేవి. మనం తాగే నీటిలో రాగి శాతం కాస్త ఎక్కువగా ఉంటె, మన ఆరోగ్యానికి మంచిందని సైన్స్ నిర్ధారించింది. పూర్వం అలా రాగి నాణాలతో మొదలైన ఈ ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. 


3. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు పడతారు. 


ఉప్పు ఎవరి చేతికైనా ఇస్తున్నామంటే తీసుకోకుండా, 'ఆ పక్కన పెట్టు తీసుకుంటా'మంటారు. పూర్వ కాలం నుండి పక్కింటిలో ఉప్పు, పప్పు, పంచదార లాంటి వస్తువులు చేబదులు తెచ్చుకునే సంప్రదాయం ఉంది. అది ఇప్పుడు మనం సిటీ జీవితాల్లో చూడలేకపోతున్నాం గాని, చాల ఊర్లలో కొనసాగుతూనే ఉంది. ఉప్పు ఇచ్చిన అధికారంతో ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళని ఒక మాట అనే అవకాశముందని, గొడవలు పడతారని, తీసుకోవద్దంటారు. కానీ ఈ రోజుల్లో ఆ పక్కనే ఉన్న ఉప్పు డబ్బా ఇవ్వమన్న తీసుకొచ్చి ఈ పక్కనే పెడుతున్నారు.