4.ఫేర్-వెల్ - సాంపిల్ చాప్టర్


ఏప్రిల్ 2012  
విశాఖపట్నం


"నాన్న... ఎగ్జామ్స్ అయిన వెంటనే నేను హైదరాబాద్ వెళ్ళిపోదామనుకుంటున్నా" టీవీ చూస్తున్న నాన్నతో చెపుతూ పక్కనే కూర్చున్నాను.


నెలలు గడుస్తున్నకొద్ది సహస్ర తిరిగొస్తుందనే నమ్మకం కూడా నెమ్మదిగా తగ్గిపోయింది. ఆరు నెలలవుతున్నా ఒక్క మెసేజ్ కూడా లేదు. నెమ్మదిగా తన స్మృతులు, అనుభూతులు... నా నుండి దూరమవ్వడం నాకు తెలుస్తుంది.

ఇక పై విశాఖపట్నంలో ఉండకూడదనే నిర్ణయానికి వచ్చేసాను. వేరే ఏదైనా ఊరుకు వెళ్లి కొత్త జీవితం ప్రారంభించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. సహస్ర కోసం ఎదురుచూసి చూసి అలసిపోయి తీసుకున్న నిర్ణయం ఇది, అదే సమయంలో శేఖర్ హైదరాబాద్లో ఉండాలనుకుంటున్న విషయం నాతో చెప్పడంతో అక్కడే తనతో ఉందామని నిర్ణయించుకున్నాను. 

"వెళ్లి ? ఏం చేస్తావ్ ?" నా వైపు చూస్తూ అడిగారు నాన్న.
"టీ.సి.ఎస్ కాల్ లెటర్ రాటానికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చేమో. ఈ లోపు ఏదైనా సాఫ్ట్ వెర్  కి సంబంధించిన కోర్స్ చేస్తాను"
"ఎప్పుడు వెళదామనుకుంటున్నావు?" నేనెందుకిలా మాట్లాడుతున్నానో అర్ధంకావటంలేదు నాన్నకి. 
"ఎగ్జామ్స్ అయిపోయిన రోజు రాత్రే"
"నీకేమైనా పిచ్చెక్కిందా. అనవసరంగా హైదరాబాద్ వెళ్ళటమెందుకు? ఆ కోర్స్ ఏదో ఇక్కడే చేసుకోవచ్చు కదా... " కోపంగా అరిచింది అమ్మ పక్కనుండి.
"లేదులే వెళ్లనీ, తెలుసుకుంటాడు" సర్ది చెప్పారు నాన్న.
"ఫోన్ నెంబర్ కూడా మార్చేస్తున్న ఆ రోజు తో ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అందరితో కాంటాక్ట్ కట్ చేసేస్తున్న"
"నిజంగానే వీడికి పిచ్చెక్కింది " రెట్టించింది అమ్మ .
"ఫోన్ నెంబర్ మార్చడమేందుకు ?" ప్రశించారు నాన్న.
"ఏమో నాకొక కొత్త జీవితం ప్రారంభించాలని ఉంది. అలా అని ఇప్పుడేవో ఇబ్బందుల్లో ఉన్నానని కాదు. ఏమో... కొత్తగా ప్రారంభించాలని ఉంది. మీకు ఎవరైనా కాల్ చేస్తే హైదరాబాద్లో ఉన్నానని చెప్పకండి. బయటకి వెళ్ళాడని మాత్రమే చెప్పండి.. ఫేసుబుక్ కూడా డిఏక్టివేట్  చేసేస్తున్న. ఒకరిద్దరితోనే కాంటాక్ట్ లో ఉందామనుకుంటున్నా"
"సరే నీకు ఎలానచ్చితే అలానే చెయ్. కానీ డబ్బులు కోసం మాత్రం ఇబ్బంది పడకు, అవసరమైతే కాల్ చెయ్ పంపిస్తాను"
"సరే నాన్న. నేను టికెట్ బుక్ చేసుకుంటాను " లోపలి వెళ్ళిపోతూ చెపుతుంటే
"కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో... ఇప్పుడు నీకు ఉద్యోగం ఉంది, సమయం కూడా ఉంది. ఇప్పుడు దర్జాగా ఇంట్లో ఉండగలవు. ఒక్కసారి ఇంటినుండి బయటకి వెళ్తే... మళ్ళి ఇంటికి రావాలనిపిస్తే, ఎన్నో విషయాలు ఆలోచించాల్సి వస్తుంది" సలహా ఇస్తున్నట్టు హెచ్చరించారు నాన్న.

        నిజమే... నాన్న చెప్పింది. ఇంటి నుండి బయటకు వెళ్ళాకా, మళ్లి ఇంటికి రావాలంటే చాల విషయాలు ఆలోచించాల్సి వస్తుంది... అలా అని, మనం ఇంట్లోనే ఉండిపోతే బయట ప్రపంచం మనకు పరిచయమే కాకుండా పోతుంది.
     
            ఇంట్లో కూర్చున్నంత వరకు మనకు జీవితం విలువ తెలియదు. బయట పడితే ఏడుస్తాం... కష్టపడతాం... నవ్వుతాం... కొందర్ని నమ్ముతాం... మోసపోతం... అంతలోనే తెలుసుకుంటాం.

         జీవితం లో ఎలా బ్రతకాలో ఎక్కడ ఎవరు రాసి పెట్టలేదు, జీవితమే గొప్ప పాఠం నేర్పిస్తూ ఉంటుంది, అది నేర్చుకోకపోతే... ఇంకొక రకమైన పాఠం నేర్చుకోవల్సొస్తుంది... అదే గుణపాఠం.


 *** ***

"ఇంకా ఎంత సేపు పడుతుందనుకుంటున్నావ్ ?" ఒక మూలన కూర్చుని అభిషేక్ తో మాట్లాడుతున్న అవినాష్ ని అడగడానికి గట్టిగా అరుస్తూ  ప్రయత్నించాను. హోరెత్తే పాటల శబ్దంలో వినిపించిందో లేదో కూడా అనుమానమే.
"ఏంటి ఏదో అడుగుతున్నావు ?"అంటూ పెద్దగా అరుస్తూ ముందుకు వచ్చాడు అవినాష్.
"ఇది ఇప్పట్లో అవుతుందా?" మళ్లి  గట్టగా మాట్లాడుతూ అడిగాను.
"అయిపోతుందంట ఇంకో మూడు పాటలే. ఇందాకే అభిషేక్ చెప్పాడు" అప్పటికే దగ్గరకి వచ్చేసరికి నెమ్మదిగా మాట్లాడాడు.


        ఫేర్-వెల్ పార్టీ కోసం వైజాగ్ ఫోర్ పాయింట్స్ హోటల్ లో ఆరవ అంతస్థులోనున్న పబ్ లో ఉన్నామందరం. ఉదయం నుండి ఆటపాటలతో చాల కోలాహలంగా కొనసాగుతుంది.

      కాసేపటికి డి.జె పూర్తయింది. ఒక్కొక్కరు మైక్ తీసుకోని నాలుగు సంవత్సరాలుగా తమకు కలిగిన ఫీలింగ్స్ కాన్ఫెస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో వెళ్ళిపోతున్నామనే బాధ, మాటల్లో విడిపోతున్నామనే భావం నేను చూడగలుగుతున్నాను. కాస్త బరువెక్కిన హృదయంతో, ఇంకాస్త బరువైన పదాలతో రెప్పల బయటకు ఎప్పుడొస్తాయో తెలియని కన్నీటిబొట్లను అక్కడే నిలవరించుకుంటూ మాట్లాడుతున్న మాటలు, అందరిని కదిలిస్తున్నాయి.  అంతటా నిశ్శబ్దం. ఇప్పుడు నా వంతు. పక్కన ఉన్నవారెవరో మైక్ అందించారు. కాస్త బెరుకు,భయంతో మాట్లాడటం మొదలుపెట్టాను... 

        "హలో, ముందుగా నేనెవరికీ థాంక్స్ చెప్పాలనుకోవట్లేదు... అలా అని సారీ కూడా చెప్పాలనుకోవట్లేదు"

   "ఫస్ట్ ఇయర్లో... 'సి' ఎక్సమ్ ఫెయిల్ అవుతాననే భయంతో... ఆత్మహత్య చేసుకుందామని ఏడ్చుకుంటూ బీచ్ కి వెళ్లిన సందర్భం నాకింకా గుర్తుంది. ఈరోజు ఇలా మీ ముందు దైర్యంగా మాట్లాడుతున్ననంటే నాకు ఈ నాలుగు సంవత్సరాలు  నేర్పించిన జీవిత పాఠం"

       "నాకొక రోజు అనిపించింది ఎంతమంది మన చుట్టూ ఉన్నా... ఎన్ని విషయాలు మనం పంచుకుంటున్నా... గీతం గేట్ బయటకు నేనొక్కడినే నా డిగ్రీ పట్టుకొని వెళ్తానని"

     "మన క్లాస్ లో గొడవలు ఎక్కువ... యూనిటీ లేదని మనం చెప్పుకున్న మాటలనే ఒకసారి గుర్తు చేసుకుంటున్న, ఇంజనీరింగ్ అంటే ఇలానే ఉండాలి... ఉంటుంది కూడా. ఇలా ఉంటేనే దానికో అర్ధం ఉంటుంది... కొట్టుకున్నాం... తిట్టుకున్నాం... ఏడ్చామ్... నవ్వామ్... పంచుకున్నాం... తెంచుకున్నాం... చివరకు వెళ్ళిపోతూ, ఇలా నిస్సహాయంగా భావాలు వ్యక్తం చేసుకుంటున్నాం"

   "కాలేజీ రోజులు నాకు పూర్తిగా సంతోషాన్నిచ్చాయి. ఇంజనీరింగ్ అంటేనే ఇది కదారా, వివాదం... వినోదం... వికాసం... నాకు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోడానికి చాల మధురానుభూతులు ఇచ్చిన మీ అందరికి థాంక్స్"

 "థాంక్యూ ఎవరీ వన్ అఫ్ యు."

అందరి కళ్ళలో కన్నీరు మొదలైంది. నాలుగు సంవత్సరాలలో తెంచుకున్న బంధాలన్ని కలుస్తున్నాయి. కాసేపటికి గ్రూప్ ఫోటో కోసం అందరం నిలబడ్డాం. కన్నీళ్ళకి చెరిగిపోయిన మేక్-అప్ తో అమ్మాయిలు వాళ్ళని నవ్వించడానికి అబ్బాయిలు పడుతున్న తంటాలు.


అద్భుతంగా వచ్చాయి  ఫోటోలు.

"తర్వాత ఏంటి మరి ? సెవెన్ అవుతుంది కదా టైం" పక్కనే ఉన్న అవినాష్ ని అడిగాను.
"ఏమో, నాకు సరిగ్గా తెలియదురా. అది సరే గాని ఆ అభిషేక్ కి ఏదో అర్జెంటు పనిఉందంటా, డ్రాప్ చేయమంటున్నాడు బైక్ 'కీస్' ఇవ్వు ఒకసారి"
"అంత అర్జెంటు పనేముంటుందిరా... ఉండమను కాసేపు... అయిపోతుంది కదా ఇంకొన్ని నిమిషాలలో" జేబులోనుండి బైక్ 'కీస్' తీస్తూ చెప్పాను .
"బ్యాంకు టైమింగ్స్ అయిపోతాయన్నాడు" అప్పటికే తాళం తీసుకున్నాడు అవినాష్.
"సరే, త్వరగా వచ్చెయ్ మరి..." చెప్తుండగానే నన్నెవరో పిలవడం గమనించాను.

అటుగా వెళ్లి అందరితో కలిసి మాట్లాడుకుంటూ ఉండగా, అవినాష్ నుండి కాల్ వచ్చింది.

"హలో, హలో " పాటల శబ్దములో వినిపించకపోవడంతో గట్టిగా మాట్లాడాను.
అటు నుండి ఏమి వినిపించకపోవడంతో అలా డోర్ బయటకు వెళ్లి లిఫ్ట్ దగ్గర నుండి మాట్లాడుతుంటే వినపడుతున్నాయి ఫోనులో మాటలు...
"బైక్ ఎక్కడ పెట్టావు ?" బైక్ కోసం పార్కింగ్ లో వెతుకుతున్నాడనుకుంటాను.
"అక్కడే ఉంటుంది చూడరా 'డీ' పార్కింగ్ దగ్గర " లిఫ్ట్ పక్కన అద్దంలోనుండి కిందకి చూస్తూ మాట్లాడుతున్నాను.
"సరే రా చూస్తాను" అని చెప్పేసి కట్ చేసేసాడు అవినాష్.

మాట్లాడుతుండగా.... అప్పుడప్పుడే చీకటి పడుతున్న సమయంలో, స్పష్టత లేకుండా ఎవరో తెలిసిన మనుషులే అక్కడ చీకటిలో కదులున్నట్టనిపించింది. అదే సమయంలో అటుగా ఏదో కారు రావటంతో ఆ హెడ్ లైట్ వెలుగు ఆ మనిషి మీద పడింది.

అంతే,
కరెంటు తీగ పట్టుకున్నట్టుగా ఒక్కసారి షాక్ తగిలింది నాకు...
చాలా పెద్ద షాక్...
అంత షాక్ నుండి తేరుకోడానికి కొన్ని సెకెన్లు పట్టింది నాకు...

సహస్ర...
ఆరు నెలలుగా ఒక్క మాట కూడా మాట్లాడని సహస్ర...
ఇన్ని రోజులు ఎంత వెతికిన దొరకని సహస్ర...
ఎవరికోసమైతే అంతలా నేను బాధపడ్డానో, అదే సహస్ర...
ఎవరికోసమైతే ఎదురు చూసి నేను విసిగిపోయానో అదే సహస్ర...

అక్కడ బయట పార్కింగ్ దగ్గర తన స్కూటీ ఆపి ఫోన్ లో మాట్లాడుతుంది.

ఒక్కసారిగా గుండె చాలా వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. వెంటనే లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసాను, కానీ లిఫ్ట్ రావటంలేదు. ఆరవ అంతస్థున్న ఉన్న నేను పరిగెత్తుకుంటూ మెట్లు దిగి తనున్న చోటు కి వెళ్లే సరికి తనక్కడ లేదు. ఒళ్లంతా చెమటలు. హార్ట్ బీట్ క్షణక్షణనికీ పెరుగుతూ పోయింది.

కాళ్లలో వణుకు, కళ్ళలో ఆశ, గుండెల్లో భయంతో అటు ఇటు చూస్తూ పిచ్చి వాడిలా వెతుకుతున్నాను తనకోసం.

ఎక్కడికి వెళ్లిపోయావ్ 
చూసాను నేను... 
నిన్నే చూసాను... 
నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు...
అది నువ్వే
ఆ జడ, నేను కచ్చితంగా గుర్తుపట్టగలను.... 
ఎంత మందిలో ఉన్నా గుర్తుపట్టగలిగే జడ నీది... 
ఎక్కడికి వెళ్లిపోయావ్... కనిపించు 
చాలా మాట్లాడాలి నీతో... కనిపించు సహస్ర... 

బిల్డింగ్ సెల్లార్ లోనికి వెళ్ళాను అక్కడ లేదు...
వెనుకున్న లాబీ మొత్తం పరిశీలించాను, తన జాడ లేదు
కొంచం ముందుకెళ్లి రోడ్ పైన నుంచొని అటు ఇటు చూసాను... వేగంగా పోతున్న వాహనాలు తప్ప, తను వచ్చిందనే గుర్తులు కూడా లేవు.

ఇక చేసేదేమి లేక నిరాశతో వెనుతిరిగి, గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుండగా, ఎందుకో మరి అలా ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ డోర్ వైపు వెళ్ళింది నా చూపు...

అంతే, ఆ దిశగా తిరిగాయి నా అడుగులు...

జడ, అదే జడ, తనని పట్టించింది.
ఒక పక్కన అటు వైపు తిరిగి కూర్చున్న సహస్ర జడ కనిపించింది. తన వైపు పడుతున్న ప్రతి అడుగుకీ, నాలో టెన్షన్ పదింతలవుతుంది.


"ఏమైపోయావ్ ఇన్నిరోజులు? " ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాను.

డిన్నర్ టైం అప్పుడే స్టార్ట్ అవడంతో రెస్టారెంట్ అంత ఖాళిగానే ఉంది.

ఒంటినిండా చెమట, నిరాశతో అలసిపోయిన కళ్ళు...
నన్ను చూడగానే తనలో కంగారు మొదలైంది. అదే అందమైన కళ్ళలో భయం.

నన్నలా అక్కడ ఉహించకపోవడంతో తను కూడా షాక్ తింది. కంగారు, భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి తన కళ్ళలో...

"సాగర్ వస్తాడు, మనం తరువాత మాట్లాడదాం... నువ్వు వెళ్ళిపో గౌతమ్" కంగారుగా చెప్పింది.
"ఇప్పుడు నేను వెళ్ళిపోతే నువ్విక కనిపించవు సహస్ర, ఏమైంది నీకు ఏమైపోయావ్ ఆరు నెలలు.... నాకు సమాధానం కావాలి" కోపంలో వస్తున్నాయి నా మాటలు.
"గౌతమ్ ఇది టైం కాదు, ప్లీజ్ నేను చెప్పేది అర్ధం చేసుకో. నేను  నిన్ను రేపు కచ్చితంగా కలుస్తాను" బ్రతిమిలడుతూ మాట్లాడింది.

ఇంతలో మోగింది తన ఫోన్.
ఏమి మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేసి కాల్ లిఫ్ట్ చేసింది.

"హలో సాగర్"

ఫోనులో ఫుల్ వాల్యూం ఉందేమో... రెస్టారెంట్ అంత నిశ్శబదంగా ఉండటంతో... అవతల మాటలు నాక్కొంచం అస్పష్టంగా వినపడుతున్నాయి.

"సహస్ర... ఎన్.ఏ.డి జంక్షన్ దగ్గర ఎవరికో ఆక్సిడెంటయింది. ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది, నేను సింహాచలం వైపు నుండి వస్తాను, ఒక అరగంట లేట్ అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో... నేను ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటా"
"పర్లేదు సాగర్, నేనిక్కడ వెయిట్ చేస్తాను మీరు వచ్చేంతవరకు" బదులిచ్చింది సహస్ర.
"సరే నేను త్వరగా వచ్చేస్తాను" కట్ అయింది కాల్.

కాల్ ఎప్పుడు కట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న నాకు, సహస్రతో మాట్లాడేందుకు ముప్పై నిముషాలు దొరకడంతో, మాట్లాడటం మొదలుపెట్టాను.

"సాగర్ ఎవరు? పిచ్చోడినయిపోతున్న సహస్ర... ఆరు నెలల నుండి పిచ్చోడిలా తిరుగుతున్న నేను, ఏమైంది నీకసలు" అడిగాను చిరాకు, కోపం కలగలిపిన గొంతుతో.
"ఏమి లేదు గౌతమ్. అయిపోయింది కదా వదిలే" ఫోన్ టేబుల్ పైన పెడుతూ చెప్పింది.
"అయిపోయింది కదా అని అంత ఈజీగా చెపుతావేంటి, ఒక మాట, మెసేజ్ లేకుండా నీ పట్టాన నువ్వు బ్లాక్ చేసేస్తే నేనెమవ్వాలి ?" రెట్టించిన కోపంతో.
"ఒక్క కాల్ లేదు మెసేజ్ లేదు... ఉద్యోగం వచ్చిందని చెప్పిన రోజు నుండి అసలు మాటలే లేవు... నేనెం తప్పు చేశాను చెప్పు" తనకి మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా నిలదీస్తూ అడిగాను.
"డాడీ చూసేసారు గౌతమ్ " తల దించుకుంటూ వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నన్ను ఒక్క మాటతో మౌనానికి గురిచేసింది.
"ఏం చూసారు? ఎక్కడ చూసారు ?" ఆశ్చర్యంగా అడిగాను.
"ఆ రోజు తెన్నేటిపార్కులో నువ్వు నా చెయ్యి పట్టుకొని నడవటం డాడీ చూసేసారు..." చెపుతుంటే తన కళ్ళలో బాధ చూడగలుగుతున్నాను.
"ఎం మాట్లాడుతున్నావ్ సహస్ర... మీ డాడీ మనల్ని చూడటమేంటి... అది కూడా...  అంత పొద్దున్న" ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాను.

"అవును, ఆ రోజు ఇంటికెళ్ళగానే నాన్న హాల్లో కూర్చొని ఉన్నారు, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లావని అడిగితే ఫ్రెండ్ తో జాగింగ్ కి అని చెప్పాను " చెప్తూ ఉంది అసలేం జరిగిందో.
"సరే అయితే ఏమైంది మరి ?" త్వరగా తెలుసుకోవాలి ఏమైందో.
"నువ్వెక్కడికి వెళ్ళావో... ఎవరితో వెళ్ళావో, నాకంతా తెలుసు... ఇంతకు ముందెప్పుడు నువ్విలా వెళ్ళలేదు... ఇప్పుడిప్పుడే మొదలవుతుందని నేననుకుంటున్నాను, ఇది ఇప్పుడే ఆపేస్తే మీ ఇద్దరికీ మంచిది. లేదంటే నేను నా పోలీస్ పద్ధతిలో వెళ్లాల్సి వస్తుంది అని చెప్పటంతో నీకేమైనా అవుతుందేమో అని నేను భయపడిపోయాను"

సహస్ర వాళ్ళ నాన్న విశాఖపట్నం డి.ఎస్.పీ, చాల పలుకుబడున్న వ్యక్తి, రాజకీయనాయకులతో, వ్యాపారవేత్తలతో మంచి సంబంధాలున్న వ్యక్తి. ధనిక కుటుంబం వాళ్ళది.

"సహస్ర, నీకీ రీసన్ సిల్లీగా అనిపించలేదా ?" చెప్పిందంతా విని అడిగాను.

"ఇప్పుడలా అనిపిస్తుందేమో గౌతమ్... కానీ ఆ టైంలో నాకు భయమేసింది... నా వల్ల  నువ్వు ఇబ్బందులు పడకూడదు... తెలుసు కదా డాడీ గురించి, పోలీస్ పద్ధతుల్లో అనేసరికి నా కాళ్ళు ఆడలేదు, అందుకే బ్లాక్ చేసేసా. ఆ తరువాత రోజు నుండే డాడీ నా ఫోన్ తీసేసుకున్నారు, ఇక ఎప్పుడు కాల్ చేద్దామన్న అవ్వలేదు"

"సరే, ఫోన్ అంటే లేదు... కనీసం ఒక ఈ-మెయిల్ అయినా చెయ్యాల్సింది కదా... ఫేస్ బుక్, వాట్సాప్ ఇవేమి యూస్ చెయ్యమన్నా చెయ్యవు... కనీసం ఒక ఈ-మెయిల్ సహస్ర"

"ఈ-మెయిల్ చెయ్యాలన్న కాలేజీకో, నెట్ సెంటరుకో వెళ్లాల్సిన పరిస్థితి... ఇంట్లో ఇంటర్నెట్ లేదు కదా గౌతమ్... అప్పటికి నేను నా ఫ్రెండ్ శ్రేష్టాకి నీ నెంబరిచ్చి కాల్ చేసి చెప్పమన్నాను... అది చెపుతానని చెప్పింది... నీకు చెప్పిందనే అనుకున్నాను. కనీసం అది నీకు చెప్పిందో లేదో తెలుసుకోడానికి దానితో మాట్లాడదామన్నా కుదరని పరిస్థితి "

"సరే, అర్ధం చేసుకోగలను... మరి కాలేజీ కి ఎందుకు వెళ్ళలేదు అన్ని రోజులు ?"

"ఎక్కడికి వెళ్లాలన్నా అన్నయ్యనిచ్చి పంపేవాళ్లు, కాలేజీకి వెళ్తానన్న వద్దనేశారు. హెచ్.ఓ.డి తో మాట్లాడేసాను ఏప్రిల్ లో వెళ్లి ఎగ్జామ్స్ రాసొచ్చేస్తే చాలన్నారు. ఇక నేనెదురు చెప్పలేకపోయాను గౌతమ్" కన్నీరు తుడుచుకుంటూ చెపుతుంది "నాకు తెలుసు నువ్వు పిచ్చోడిలా నాకోసం చూస్తుంటావని, కానీ నేను నీకేమీ చెప్పలేకపోయాను, నన్ను క్షమించు గౌతమ్"

"ఇంతకీ సాగర్ ఎవరు ? "

మౌనంగా తలదించుకు కూర్చుంది.

"చెప్పు సహస్ర... సాగర్ ఎవరు? నీ కజినా?" తను సమాధానమివ్వకపోవడంతో మళ్లి అడిగాను.
"వచ్చేనెలలో నాతో నిశ్చితార్ధం చేసుకోబోయే వ్యక్తి" చెప్తుండగానే నా గుండె పగిలిపోయినంత పనైంది, అక్కడనుండి తను చెప్పేమాటలు సరిగా వినపడటంలేదు. "మొన్నే పెళ్లి చూపులయ్యాయి, వచ్చేనెల ఎంగేజ్మెంట్"
"సరే సహస్ర ఇక నేను వెళ్తాను" కుర్చీలోనుండి లేస్తూ చెప్పాను.
"నాకు తెలుసు నువ్విలా రియాక్ట్ అవుతావని, అందుకే నా గురించి నీకేమీ తెలియకూడదనుకున్నాను"
"ఏదైతేనేం అయిపోయింది కదా వదిలేద్దాం" అప్పటికే లేచాను వెళ్ళటానికని.
"నా మీద కోపంగా ఉందా గౌతమ్ ?" తను కూడా లేచింది.
"నాకు నీ మీద ఉండేది ప్రేమ సహస్ర... ప్రేమ మాత్రమే" నా కళ్ళలో ఒక రకమైన అబద్ధపు నవ్వు.
"నన్ను క్షమించు గౌతమ్" మౌనంగా  తలదించుకుని కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది.
"క్షమించటానికి నువ్వేం చేసావని ? వదిలే సహస్ర... వెళ్తాను "
"ఏదోకటి మాట్లాడు గౌతమ్, నీ మౌనం నేను తట్టుకోలేకపోతున్నా"
"ఇంతకుమించి మాట్లాడుకోవడం మంచిదికాదు"
"ప్లీజ్ గౌతమ్ "

"ఐ లవ్ యు సహస్ర !" అదుపులో పెట్టుకున్న పదాలు అలా వచ్చేసాయి.
"ఐ నో... ఐ యమ్ హెల్ప్ లెస్" అప్పటి వరకు దాచుకున్న బాధ ఒక్కసారిగా బయటపడిపోయింది. ఏడ్చేయటం మొదలుపెట్టింది.
"ప్రేమ దగ్గరగా ఉన్నపుడు అద్భుతంగా ఉంటుంది సహస్ర, కానీ అదే ప్రేమ దూరమవుతున్నపుడు ఇంకా అపురూపంగా మారుతుంది..." బాధలోనుండి వస్తున్నమాటలకు కళ్ళలో ఒక రకమైన అబద్ధపు నవ్వు "ఇన్ని రోజులు నువ్వు దూరమయ్యావని బాధ కన్నా, నీకు దగ్గరవ్వాలనే క్రమంలో నేనేదైన చేస్తే మీ ఇంట్లో నువ్వు ఇబ్బంది పడకూడదనే ప్రేమే ఎక్కువుంది"
"నేనే తప్పు చేశాను" ఇంకా ఏడుస్తూనే చెప్పింది. 
"ఎవరేం చేసిన, నువ్వు నాకు కావాలని ఒక్క మెసేజ్ సహస్ర, ఒక్కటంటే ఒక్క మెసేజ్... ఆ ఒక్క మెసేజ్ మనిద్దరిని కలుపుతుందని మాత్రం నమ్ము, ఎప్పటికి వెయిట్ చేస్తూనే ఉంటా, ఎప్పటికీ... బాయ్" చెప్పి వెనుతిరిగాను.
కాస్త ముందుకెళ్లి ఒక్క సరి సహస్ర వైపు తిరిగి "కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో సహస్ర, ఒకమ్మాయి జీవితంలో తండ్రెక్కువ ? లవరెక్కువ అంటే ? తండ్రే ఎక్కువ కావొచ్చు... కానీ తండ్రెక్కువ భర్త ఎక్కువ అంటే ?.... ఈ ప్రశ్నకి సమాధానం నాకంటే నీకే బాగా తెలుస్తుంది. నేనెప్పుడూ నీకొక లవర్ లా మిగిలిపోవాలనుకోలేదు సహస్ర, భర్తగా నీతో కలిసి జీవితాన్ని పంచుకుందామనే నమ్మకం ఉండేది. కానీ చివరకు ఒక స్నేహితుడుగానే.... ఒక హితుడుగానే మిగిలిపోయాను"

ఎందుకు సహస్ర ఎందుకిలా చేసావు... 
ఇది తీసుకోడానికి చాలా కష్టంగా ఉంది... 
నువ్వు ఇంకొకరితో పెళ్ళికి సిద్ధమైపోయావు... 
చాలా కష్టంగా ఉంది సహస్ర...

*** ***

ఏప్రిల్ 30
విశాఖపట్నం రైల్వే స్టేషన్

"మీ ఫ్రెండ్ వస్తాడా స్టేషనుకి రేపు ఉదయం ?" పక్కనే నడుస్తూ అడిగారు నాన్న.
"వస్తాడు నాన్న" చేతిలో పుస్తకం, భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకొని విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద నడుస్తున్నాం ఇద్దరం. 

               ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి కావడంతో హైదరాబాద్ ప్రయాణమయ్యాను... ఒకటే బ్యాగ్ అందులో నాలుగు జతల బట్టలు, నాలుగు పుస్తకాలు. అంతే అంతకు మించి ఇంకేం కావాలి. పర్సు లో నాన్న పెట్టిన డబ్బులు. ఇంకొక చేతిలో రాత్రి తినడానికి అమ్మ చేసిన చపాతీ. 

              ఇంతకు ముందు ఒక్కడినే ప్రయాణం చేశాను గాని ఇలా పూర్తిగా ఎప్పుడొస్తానో తెలియకుండా వెళ్లడం జరగలేదు.  అక్కడకు వెళ్లి ఎం చేస్తాను ఎలా బ్రతుకుతాను అనే ఆలోచన అయితే ప్రస్తుతానికి మదిలో లేదు. ముందైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండకూడదు, అదొక్కటే ఆలోచిస్తున్నాను.

   ఇంకా గంట సమయం ఉంది. అక్కడే ప్లాటుఫారం మీద కూర్చున్నాము. 

"ఇప్పుడు నువ్వు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు అని నేను ప్రశ్నించనుపక్కనే కూర్చొని మాట్లాడుతున్నారు నాన్న... చూస్తూ వింటున్నాను నేను "జీవితం లో మనమే పని చేసిన తప్పు, ఒప్పు అంటూ ఏమి ఉండవు. ఆ పని నుండి మనమేం నేర్చుకున్నామనేదాని పైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏ పనైనా  చేసేముంది ఒక్క సారి ఆలోచించు... మనమీ పని చెయ్యటం ఎంత వరకు కరెక్ట్ అని "

 "కష్టం అనేది తెలియకుండా పెరగావు. మున్ముందు ఇంకా చాల కష్టాలు చూడాల్సి వస్తాది. దేనికి అధైర్య పడకూడదు. ఎంత కష్టం వచ్చిన, దాని తర్వాత కూడా మనకు చాల మంచి జీవితం ఉందని గ్రహించాలి. "

"డబ్బులు కోసం ఇబ్బంది పడకు. అకౌంట్ లో వేస్తూ ఉంటాను. ఏవైనా అవసరం అయితే వెంటనే కాల్ చెయ్ "

"సరే నాన్న" తను చెప్పిందంతా అర్ధంచేసుకుంటూ చెప్పాను.
"ఎక్కు... బండి కదిలిపోతుంది " భుజం పైన చెయ్యి వేస్తూ చెప్పారు. 
ఎక్కి కిటికీ పక్కన కూర్చున్నాను.
నాన్న బయట ప్లాటుఫారం మీద నుంచొని లోనికి చూస్తూ "జాగ్రత్త నాన్న , టైం కి తిను. డబ్బులకి ఇబ్బంది పడకు" అని చెప్తుండగానే ట్రైన్ కదిలింది.
నాన్న చెయ్యి ఉపుతూ బాయ్ చెప్తుంటే కళ్ళలో ఎందుకో ఒక్క క్షణం కన్నీరు తిరిగాయి...

నాన్న ప్రతి ఒక్కరి హీరో...
అమ్మలా ప్రేమ చూపించలేకపోయిన...
తమ్ముడులా విషయాలు పంచుకోలేకపోయిన...
స్నేహితుడిలా కలిసి తిరగపోయిన...

నాన్నంటే నాన్నే ఎవరికైనా...
అక్షరాలకందని ప్రేమ...
ఎల్లలు లేని ప్రేమ... 

ట్రైన్ బయల్దేరుతుంటే నాన్న ప్లాటుఫారంపై నుంచొని నన్నే చూస్తూ చెయ్యి ఉపుతుంటే, మనసులో ఏదో తియ్యని బాధ...

చిన్నప్పటినుండి వేలు పట్టి నడిపించావ్... 
నువ్వు నిద్రమాని నాకు జోల పాట పాడావ్...
పలకా బలపం పట్టి అక్షరాలు దిద్ధించావ్...
నువ్వు చెమటోడ్చి నన్ను చదివించావ్ ... 
నువ్వు పస్తులుండి నా కడుపు నింపావ్ ...
నీ ఖర్చులు తగ్గించుకొని నాకు డబ్బులిచ్చావ్...
నీ అవసరాలు మానుకొని నా స్కూలు ఫీజులు కట్టావ్... 
ఎలాంటి సమయంలోనైనా నా వెనుకే నిలబడ్డావ్... 
ఇప్పుడు నిస్సహాయంగా అక్కడ నుంచొని చెయ్యి ఊపుతూ... బ్రతకడం నేర్పిస్తున్నావ్...
జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా నిన్ను బాధపెట్టే పని మాత్రం చెయ్యలేను నాన్న... 
చెయ్యను కూడా... 

కాసేపటికి ట్రైన్ విశాఖపట్నం స్టేషన్ దాటింది.

పైలట్ అనౌన్స్మెంట్ వినపడటం తో ఉలిక్కిపడి ప్రస్తుతానికి వచ్చాను. హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. ఫోన్ ఫ్లైట్ మోడ్ నుండి తీసేయడంతో సిగ్నల్ వచ్చింది. అప్పటివరకు ఉన్న మెసేజస్ అన్ని ఒకేసారి రావటం మొదలైంది.

మొదటి మెసేజ్ లాస్య నుండి వచ్చింది "ఎక్కడున్నావ్ ?"

హారిక నుండి 
"హైదరాబాద్ వెళ్లిపోయావా ?"
"ఇంకా ఫ్లైట్ లోనే ఉన్నావా ?"
"ఇప్పుడే వచ్చాను ఇంటికి"


నవలకి వచ్చిన ప్రశంస

ముందటి ఎపిసోడ్ - 3.సహస్ర
తరువాతి ఎపిసోడ్ - 5.హైదరాబాద్ 

Popular Posts