Post Top Ad

August 25, 2017

9:53 PM

తప్పక చూడవలసిన 'రామనారాయణం'


రామాలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఎంతో విశిష్ట కలిగిన రామ మందిరాలు 'భద్రాచలం' లాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి విశిష్ట కలిగిన రామ ప్రదేశాలలో కొత్తగా చేరినది 'రామనారాయణం'

విజయనగరం జిల్లాలో ఒక చిన్న ఊరు 'రామనారాయణం'.
గతేడాది వరకు ఎవరికీ తెలియని ఈ ఊరు, ఇప్పుడు పర్యాటకులకు ఒక కొత్త యాత్ర ప్రదేశంగా మారింది.

ఏముంది అక్కడ?
మన పురాణం ఇతిహాసాల ప్రకారం, అత్యంత శక్తీవంతమైన వాటిల్లో రామబాణం ఒకటి. అంతటి శక్తివంతమైన రామబాణం ఆకారంలో ఉన్న ఒక గొప్ప కట్టడం.
దాదాపు 15-20 ఎకరాల విస్తీర్ణంలో అందంగా ఎక్కుపెట్టిన బాణం ఆకారంలో ఉన్న ఈ కట్టడానికి మరెన్నో విశిష్టతలు ఉన్నాయి.


గూగుల్ మ్యాప్స్ లో సైతం కనిపించేలా కట్టిన ఈ కట్టడం విజయనగరం జిల్లా కి ఉన్న సుందరమైన ప్రదేశాల్లో ఒకటి. 

అసలు కథ ఏంటి?
ప్రత్యేకత మాటకొస్తే,  మనం ఎన్నో సార్లు విన్న రామాయణ కథ. 
శ్రీరాముడి జననం నుండి అతను రావణుడిని వధించి పట్టాభిషేకుడు అయ్యినంతవరకు ఆ అద్భుతమైన రామాయణ కథను అందమైన దృశ్యరూపాలతో అక్కడ ఉంచడం విశేషం. అద్భుతమైన ఆ శిల్పకళ రామాయణ కథను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. 

నైపుణ్యం కలిగిన శిల్పకారులచే ఆవిష్కరించబడిన ఈ దృశ్యాలు చూసేవారికి, ఎంతో విలువైన సమాచారాన్ని, అంతకంటే విలువైన ఆనందాన్ని ఇస్తాయి.

నిత్య అన్నదానం 
ఇక్కడ జరుగుతున్న నిత్య అన్నదానం ఎంతో మందికి కడుపుని నింపుతున్నాయి.

మీరు కూడా ఒక సారి వెళ్లి ఈ ప్రదేశాన్ని చూసేయండి మరి.August 15, 2017

12:30 AM

ఇదే'నా' స్వతంత్ర భారతం ?!


ఇదేనా స్వతంత్ర భారతం?
ఇదే నా స్వతంత్ర భారతం!


ప్రపంచపుటల్లో ఘన చరిత్ర కలిగిన నా స్వతంత్ర భారతం,

అదే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన నా స్వతంత్ర భారతం!

వలస వచ్చిన తెల్లదొరలకు వత్తాసు పలికిన నా స్వతంత్ర భారతం,
అదే తెల్లదొరలను దేశంనుండి తరిమికొట్టిన నా స్వతంత్ర భారతం!

గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం 
ప్రతి సంవత్సరం ఒక పండగలా తప్పక జరుపుకునే మనం,
తప్పు చేసిన వాడు ఎవడైనా, తప్పించుకోని రోజు వచ్చినప్పుడే మన గణతంత్రమని,
పక్కవాడు ఎవడైనా మనం భయపడకుండా బ్రతికే రోజు వచ్చినప్పుడే మన స్వతంత్రమని,
తెలుసుకోడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో?

'71వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో నిమగ్నమైపోయిన ప్రజలు'
'70 వసంతాలు పూర్తిచేసుకొని, 71వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న స్వతంత్ర భారతం'
'రాజధానిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు'
ఇలాంటి టీవీ హెడ్ లైన్స్ వస్తున్న చోటే, 

'నాసిరకం విత్తనాలు వాడి, పంటలు పండక రైతు ఆత్మహత్య'
'నాణ్యత ప్రమాణాలు లేని ప్రైవేట్ బస్సు బోల్తా, 30 మంది మృతి'
'లక్ష కోట్ల స్కాములో విచారణకి వెళ్లిన ప్రముఖ నాయకుడు, మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి'
లాంటి వార్తలు కూడా వింటూ ఉండటం మనం చేసుకున్న దౌర్భాగ్యం.

స్వతంత్ర దినోత్సవాన్ని పండగల భావిస్తున్నాం, వీధికో జెండా పెడుతున్నాం, 
కానీ అదే వీధిలో బ్రతుకుతున్న ప్రజల భాదలను పట్టించుకొం.
ఇదేనా స్వతంత్ర భారతం?

ఆగస్టు 15 ఒక సెలవు దినంగా చూస్తున్నాం, తెల్ల చొక్కా వేసుకొని జెండా వందనం చేస్తున్నాం, 
కానీ ఆ చొక్కా నేసిన చేసిన చేనేత కార్మికుడి ఆర్తనాదం వినిపించుకొం.
ఇదేనా స్వతంత్ర భారతం?

గుండెలలో ఉండాల్సిన మువ్వన్నెల పతాకాన్ని,
చొక్కా జేబు మీద ఒక సన్నటి పిన్నుతో గుచ్చుకొని, దేశభక్తిని ప్రదర్శిస్తున్నాం.
ఇదేనా స్వతంత్ర భారతం?

'జన గణ మన' అర్ధం తెలియకపోయినా పెదాలు కదుపుతున్నాం,
కానీ, అర్ధం చేసుకునే ప్రయత్నం మనలో ఎంత మంది చేస్తున్నాం?
ఇదేనా స్వతంత్ర భారతం?

ప్రజలని భయపెట్టే ప్రజా ప్రతినిధులు ఉంటున్న ఈ దేశంలో,
రోడ్ మీద బండి ఆపి, చేతులు జేబులో పెట్టుకునే పొలిసులు ఉంటున్న ఇదే దేశంలో,
'అధికారం ఉన్న చేతుల్లోనే స్వతంత్రం ఉంటుంది' 
అనే ఈ వాక్యం అతిశయోక్తి కాకపోవచ్చు 

స్వతంత్రం తెచ్చి, శ్వాస విడిచిన వాళ్ళు నాయకుల?
అధికారంతో ప్రజలని భయపెట్టేవాళ్ళు నాయకుల?

మనకు మనమే ఆలోచించుకుందాం 

71వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
August 10, 2017

9:40 PM

జీవితం.. లైఫ్.. జిందగీజీవితం., లైఫ్., జిందగీ., 
పేరు ఏదైనా అర్ధం ఒక్కటే.
భాష ఏదైనా భావం ఒక్కటే.

కాలం కంటే వేగంగా పరిగెడుతున్న ఈ ప్రపంచంలో, 
జీవితం అనే మాటకి అర్ధం కూడా అంతే వేగంగా మారిపోతూ వస్తుంది. 

ఆ మారిపోతున్న అర్ధం
 ఒక రకంగా మనిషి సామాజిక ఎదుగుదలకి తోడ్పడుతున్నా,
మరొక వైపు అదే మనిషి మానసిక ఎదుగుదలని స్థంబింపజేస్తుంది.

ఇది తప్ప, లేక ఒప్ప అనే ప్రశ్న ఆలోచించే సమయం,
మనలో చాలా మందికి లేకపోవడం మన అదృష్టం.

ఒకవేళ మన ఈ మార్పు ఒప్పు అని చెపితే, 
ఎటువంటి ఇబ్బంది లేదు.

అదే మన ఈ మార్పు తప్పు అని సూచిస్తే,

ఇక్కడ తప్పు,
 పరిగెడుతున్న కాలానిదా?
 లేక 
మారిపోతున్న విలువలదా?

ఈ ప్రశ్నలకి సమాధానం దొరకక మనిషి ప్రతి రోజు సతమతమవుతున్నాడు.

ఇదే అందమైన ప్రపంచంలో,
అందమైన జీవితం గడుపుతున్నాను అనుకుంటున్నా మనిషి, 
ఎంత వరకు తనకి నచ్చిన అదే అందమైన జీవితాన్ని జీవిస్తున్నాడు?

మొన్నీమధ్యనే జరిగిన ఒక సర్వే ప్రకారం,
ఈ ప్రపంచంలో 70% మంది, తమకు ఆశపడిన జీవితాన్ని జీవించలేక,
పరిస్థితులకి సర్దుకుపోయి, 
ఒక మెకానికల్ బ్రతుకుని బ్రతికేస్తున్నారు.

అదే మన భారతదేశానికి వచ్చేసరికి, 
ఆ 70%, 95% అయింది.

అంటే మన దేశంలో ప్రతి 100 మందిలో అయిదుగురు మాత్రమే తమకు నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారు.

బంధాలు,  భాద్యతలు,  పరిస్థితులు,  అవసరాలు 
ఇలా మనకి మనం చెప్పుకునే కారణాలు ఎన్నున్నా,  

ఉదయం లేచిన దగ్గరనుండి, రాత్రి పడుకునేంత వరకు,
ఒక చక్రంలో తిరుగుతూ పరిగెడుతూనే ఉన్నాం.

"దీనమ్మ జీవితం"
"నచ్చింది చేయలేకపోతున్నాను"
"దీని నుండి ఎలా అయినా భయటపడిపోవాలి. కానీ"
ఇలాంటి మాటలు మనతో మనమే రోజు చెప్పుకుంటూ ఉంటాం.
చెప్పుకుంటూ మాత్రమే ఉండిపోతాం.

పరువు, ప్రతిష్ట, స్థాయి, హోదా 
అనే ఈ పదాలు,
మనలో ఆనందాన్ని నిజంగానే పెంపొందిస్తున్నాయా?

అనే ఒక్క ప్రశ్న తనకు తాను వేసుకున్నప్పుడు తన జీవితానికి నిజంగా ఒక అర్ధం దొరుకుతుంది.


ఉన్నదీ ఒక్కటే జీవితం.
నచ్చినట్టు బ్రతుకడమా? 
లేక 
నచ్చకపోయినా పరిస్థుతలకి సర్దుకుపోవడమా?

మనకి మనమే సమాధానం చెప్పుకోవాలి.July 8, 2017

10:51 PM

6.. 16... 26
6.... 16... 26

వయసులో మార్పు, ఆలోచనల్లో కూడా
ఒక ప్రయాణంలో ఎంతో మందిని కలుస్తూ ఉంటాం.
కొన్ని సరదా సన్నివేశాలు ఉంటె, కొన్ని ఆలోచింపజేసే సందర్భాలు కూడా ఉంటాయి.

అలా నా ప్రయాణాలలో ఆలోచించేలా చేసిన కొన్ని సందర్భాలలో ఇది ఒకటి.


విశాఖపట్నం - హైదరాబాద్
గోదావరి ఎక్ష్ప్రెస్స్


అప్పటివరకు ఏదో పుస్తకం చదువుతూ, అందులోనే నిమగ్నమైపోయిన నేను, కాస్త విరామం కోసం పుస్తకం పక్కన పెట్టి, నా పక్కనే కూర్చున్న వ్యక్తితో మాటలు కలిపాను. వివిధ అంశాలమీద మాట్లాడుకుంటున్న సమయంలో ఒక ఆరేళ్ళ పాప కిటికీ పక్కనే కూర్చుంటూ, బయటకి చూస్తూ ఆనందపడుతూ, తనలో తనే నవ్వుకుంటూ, మురిసిపోతూ, చెట్లని బిల్డింగులని చూస్తూ ఆస్వాదిస్తోంది.

అది చూసి, నా పెదాలమీదకి చిన్న చిరునవ్వు వచ్చేసింది. నిష్కల్మషంగా ఉన్న చిన్నపాటి ప్రపంచాన్ని తనకి తెలిసిన పద్ధతిలో అలా ఆనందించటం చూసి. చూపు మరల్చుకోవడమే కష్టమైంది. ఎలాగోలా చూపు తిప్పేసరికి, ఆ చిన్న పాపకి ఎదురుగానే కూర్చున్న ఒక పదహారేళ్ళ అమ్మాయి, ఫోన్ పట్టుకొని సినిమాలు చూస్తూ గేమ్స్ ఆడుకుంటూ, ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేసుకుంటూ కూర్చుంది.
అయినా అప్పుడప్పుడు భయటకి చూస్తూనే ఉంది.
కానీ తనకి అక్కడున్న చెట్లు, కొండలు, ప్రకృతి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి.
ఇంకేదో ఆనందం తన కళ్ళలో, పక్కనే ఉన్న ప్రకృతిని వదిలి, ఫోన్ తో ఆనందం పొందుతుంది.

అది చూసి, ఇటు వైపు తిరగగా నా ఎదురుగా కూర్చున్న ఇరవై ఆరేళ్ళ అమ్మాయి, భర్తతో ప్రయాణిస్తూ, అతని చేతిలో చెయ్యి పెట్టి భయటకి చూస్తూ ఆనందపదుతుండటం నేను గమనించాను.
తనకి తన భర్త కౌగిలి ఆనందాన్నిస్తుందనిపించింది.

ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.
అందరూ ఎవరి కిటికీ దగ్గర వారు కూర్చొని భయటకి చూస్తున్నారు.
చూస్తున్న ప్రకృతిలో మార్పు లేదు. కానీ వాళ్ళ ఆలోచనల్లో మార్పు స్పష్టంగా గమనించగలిగేదే.ఇలానే మన జీవిత ప్రయాణంలో ఒక్కో సందర్భంలో ఆనందానికి అర్థం మారిపోతూ ఉంటుంది.
కనుక ఆనందాన్ని వెతుక్కునే వాడు ఎప్పుడు వెతుక్కునే ఉంటాడు.
ఉన్న దానితో ఆనందంగా బ్రతికే వాడు, ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు.

June 18, 2017

8:33 AM

మీనాక్షి 3

   
  ఎంతో ఆశతో ఎన్నో ఆలోచనలతో మీనాక్షి కోసం ఎదురుచూస్తున్నాడు కార్తీక్. 
తను కూడా మీనాక్షిని ఎంతగానో ప్రేమించాడు. 
తనకి పెళ్లి అయింది అని తెలిసినా కూడా మీనాక్షి మీద ఉన్న ప్రేమని వదులుకోలేకపోయాడు. 

అతని ప్రేమని చెప్పటానికి మీనాక్షికి అయిన పెళ్లి అడ్డువచ్చిందే కానీ ఆ ప్రేమను పోగొట్టలేకపోయింది. తనతో గడిపిన ప్రతి క్షణం కార్తీక్ కి ఒక జ్ఞాపకమే.
తనకి ఎపుడు లేని ఎదో తెలియని ఒక ఫీలింగ్ ని కలిగించింది మీనాక్షి పరిచయం.
ఇద్దరు ఒకేలా ఫీల్ అయినా ఎప్పుడు ఆ ఫీలింగ్స్ ని బయటపెట్టలేదు. 

ఇపుడు కార్తీక్ కి ఒక అవకాశం దొరికింది తనకి మీనాక్షి మీద చెప్పలేనంత ఉన్న ప్రేమలో కొంత అయినా చెప్పాలని, మీనాక్షి ఒప్పుకొంటే జీవితాంతం కలిసి నడవాలని ఎదురుచూస్తున్నాడు కార్తీక్. 

తన జ్ఞాపకాల కాలం నుంచి వచ్చిన అక్షరామాలను ప్రతీ క్షణం నెమరు వేసుకొంటున్నాడు,

           "ఏనాటిదో మన పరిచయం, ఏ జన్మదో ఈ పరవశం
 నను విడిచి నా నీడ నీతోనే సాగింది
              ఒక క్షణమైనా నిను వీడి ఉండలేనని అది నీతోనే కలిసింది"

ఐ లవ్ యు మీనాక్షి

ఇదే తన గుండెలోతుల్లోంచి అనుక్షణం తనను తరిమి, ఆ ప్రేమలోతడిపే ఆలోచనలు. 

ఇలాగే ప్రపోజ్ చేద్దాం అని గట్టిగా అనుకున్నాడు. 
అలా తెలియకుండానే గంట గడిచిపోయింది. 
కానీ మీనాక్షి మాత్రం రాలేదు.


అపుడే వచ్చాడు కార్తీక్ ఫ్రెండ్ వాసు. 
అర్జంట్ గా నాతో రారా అని, 
మీనాక్షి కోసం చూస్తున్నానని ఎంత చెప్పినా వినకుండా అక్కడినుంచి కార్తీక్ ని తీసుకెళ్లిపోయాడు. 
ఎందుకురా ఇలా చేసావు నేను ఈ రోజు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో నీకు తెలుసు కదా అంటుండగానే వాళ్లు వెళ్ళే బైక్ , హాస్పిటల్ ముందు ఆగింది.

వెంటనే కార్తీక్ మనసులో ఎదో చెడు ఆలోచన మొదలైంది. 
అయినా సరే తనకి తాను సర్ది చెప్పుకొనే ప్రయత్నంగా ఎందుకు ఇక్కడికి వచ్చామని వాసుని అడిగాడు. 

ఆ క్షణం కార్తీక్ కి తెలియదు తనకన్నా తన మనసుకే జరగబోయేది 
మంచో లేక చేదో తెలుసుకొనే తత్వం ఎక్కువని.

కార్తీక్ ని ICU  దగ్గరికి తీసుకెళ్లాడు వాసు, 
లోపలికి వెళ్ళమని తనకోసం ఆఖరి చూపులతో మీనాక్షి ఎదురుచూస్తోంది అని చెప్పాడు.

ఆ మాటలు విన్న కార్తీక్ కి ఏమి అర్థంకాలేదు. తను ఎక్కడ ఉన్నాడోకూడా తెలియలేదు. 
అలా కార్తీక్ వింటున్నాడో లేదో తెలియకుండానే వాసు చెప్పడం మొదలుపెట్టాడు.

   కార్తీక్ ని కలవడానికి చాలా హ్యాపీగా గుండెలనిండా ప్రేమతో వెళ్తోంది మీనాక్షి కానీ, తాను కార్తీక్ కి శాశ్వతంగా దూరం కాబోతోందని తనకి తెలియదు. అనుకోకుండా ఒక ఆక్సిడెంట్ అయ్యింది. 

చాలా బలమైన గాయాలు అవ్వటంతో బతకటం కష్టమని డాక్టర్స్ చెప్పారు. 
ఆ మాటలు పూర్తి కాకుండానే కార్తీక్ ఐ సి యూ లోపలికి అడుగు పెట్టాడు. 

మీనాక్షి వద్దకు తాను వేస్తున్న ప్రతీఅడుగు తనని 
మీనాక్షికి శాశ్వతంగా దూరం చేస్తుందని తెలిసి భరించలేకపోతున్నాడు. 

అయినా తన నడక అగట్లేదు. అలా మీనాక్షికి దగ్గరగా వెళ్ళాడు.

మీనాక్షి, కార్తీక్ తో మాట్లాడిన మొదటి, ఆఖరి మాటలు, "నేను అందరి అమ్మాయిలలాగే నా లైఫ్ గురించే చాలా అందంగా కలలు కన్నాను కానీ అవేమి జరగలేదు. నేను అనుకోకుండానే నా జీవితంలో చాలా సంఘటనలు జరిగిపోయాయి. వాటితో నేనేప్పుడూ కలవలేదు. కలవాలి అనుకోలేదు. 
ఫస్ట్ టైం నేను కావాలి జరగాలి అనుకొన్న ఒక విషయం నిన్ను ప్రేమించటం, 
నీతో కలిసి నా జీవితాన్ని పంచుకోవాలి అనుకోవటం. ఇపుడు ఎన్ని నిమిషాలు నాకు మిగిలి ఉన్నాయో తెలియదు కానీ వాటిని నీతో గడపటం నాకు చాలా హ్యాపీగా ఉంది. 
ఐ లవ్ యు కార్తీక్
ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఎవరికీ ఎప్పుడూ రాకూడదు 
వచ్చినా ఈ మాటను చెప్పేలా అస్సలు రాకూడదు"

తన కళ్ళు కూడా ఏడుస్తాయని ఆ రోజే మొదటిసారిగా తెలిసింది కార్తీక్ కి. 
మీనాక్షి చెప్పే మాటలు వింటూ అలా నిలబడి ఉండిపోయాడు. 
 ఐ లవ్ యు టూ మీనాక్షి నీకేమి కాదు అంటూ గట్టిగా ఏడ్చేశాడు. 

చివరిగా మీనాక్షి కోరిన ఒక కోరిక, "కార్తీక్ నా వల్ల నీ జీవితం మధ్యలోనే ఆగిపోకూడదు నేను నీతో కలిసి జీవితాన్ని పంచుకోలేకపోవచ్చు కానీ నీకే ఒక పాపలా పుడతాను, నీతో అడతాను , పాడతాను, తిరుగుతాను...నీ చేతుల్లో పెరుగుతాను నాకు ఆ అవకాశం ఇస్తావా" అని తన చేతిని చెపుతూ అడిగింది.  

అలాగే అని తన చేతిని మీనాక్షి చేతిలో కలిపేలోపే
 మీనాక్షి తన చేతినుంచే కాదు ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది

ప్రతీ కథకు ఒక ఎండింగ్ ఉంటుంది కానీ ప్రేమ కథకు ఉండదు.
మనం ప్రేమించిన ప్రతీ వ్యక్తిని ఏవో కొన్ని కారణాల వల్ల పొందలేకపోవచ్చు అందువల్ల లైఫ్ ని స్పాయిల్ చేసుకోకూడదు. కార్తీక్, మీనాక్షి విషయంలోనూ అదే జరిగింది. 
కానీ కార్తిక్ తన లైఫ్ ని ఎండ్ చేయలేదు ఆ క్షణం నుంచి స్టార్ట్ చేసాడు 
ఎందుకంటే మనిషికే మరణం. ప్రేమకి కాదు.
తనకి తెలుసు తొందరలోనే తన మీనాక్షి తనకే పాపగా మళ్ళీ పడుతుందని

        
జీవితంలో ప్రతీ క్షణం చాలా విలువైనది. ఒక్క క్షణంలో మనం వేసే తప్పటడుగు కొన్ని వేల క్షణాలను మన నుంచి దూరం చేస్తుంది అలాగే ఒక్క క్షణంలో మనం తీసుకొనే నిర్ణయం, మన జీవితంలోని కొన్ని వేల నిర్ణయాలను చంపేస్తుంది. 


*** ***
పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక 

*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.

*** ***

June 17, 2017

4:29 AM

మీనాక్షి - 2


ముందు భాగం


కొంతమందితో మన పరిచయం కేవలం నిమిషాలే
కావొచ్చు కానీ దాని ప్రభావం మొత్తం జీవితాన్నే తాకుతుంది,

అలా కార్తిక్ ని చూడగానే ఎదో తెలియని ఒక కొత్త అనుభూతి మీనాక్షికి కలిగింది.
కార్తిక్, ఒక అమ్మాయి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకొంటుందో
సరిగ్గా అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి.

చూడటానికి అందంగా ఉంటాడు, అతని మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి,
ఎవరితో అయినా చాలా పద్దతిగా మాట్లాడతాడు.
ఎవరైనా సరే అతని మాటలకి, చేష్టలకి ఇట్టే పడిపోతారు.

కార్తిక్ కి ఆ కాలేజీలో చాలా ఫాలోయింగ్ ఉంది.
చాలా మంది అమ్మాయిలు తనకి దగ్గర కావటానికి బోలెడు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కార్తీక్ కి మాత్రం తన మనసుకు నచ్చిన అమ్మాయి ఇంతవరకు దొరకలేదు.

అది మీనాక్షిని చూడగానే మారిపోయింది. తను ఇంతకాలం ఎలాంటి అమ్మాయిని అయితే కావాలనుకున్నాడో,
 అలాంటి అమ్మాయే మీనాక్షి అని బలంగా అనుకున్నాడు.

మీనాక్షితో పరిచయం పెంచుకున్నాడు.

రోజులు, గంటలు, నిమిషాలు, సెకన్లు
ఎన్ని గడిచాయో, ఎలా గడిచాయో తెలియనేలేదు మీనాక్షికి
 కానీ కార్తీక్ తో తను గడిపిన ప్రతీ గడియా ఒక జ్ఞాపకమే.

ఆమె మదిలో ఎప్పటికి నిలిచిపోయే ఒక అందమైన భావమే.
అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు.
మీనాక్షి తనకే తెలియకుండా కార్తీక్ ని ప్రేమించింది. ఎంతగానో తనని ఆరాధించింది.
కానీ తన జీవితంలో ఉన్న ఒక చేదు సంఘటన వల్ల కార్తీక్ మీద ఉన్న  ప్రేమను బయటపెట్టే  సాహసం చెయ్యలేకపోయింది.

అనుక్షణం మీనాక్షిని వేధించే ఒక ప్రశ్నకు జవాబు కోసం ఎదురుచూస్తూ ఉండగానే మూడేళ్లు గడిచిపోయాయి.

అసలు ఏమిట ప్రశ్న?
ఎందుకు దానికి జవాబు వెతకాలి అనుకొంటోంది.

తన ప్రశ్న ఏంటంటే, "అసలు ప్రేమ అనేది నిజం అయితే అది ఎవరిలోనైన పుడుతుందనేది కూడా నిజమైతే.
పెళ్లి అయితే ప్రేమించకూడదా?"

ఈ ప్రశ్న కొన్ని వేల సార్లు, లక్షల సార్లు తన మదిలో మెదిలేది.
కానీ దాని సమాధానం మాత్రం తెలిసేది కాదు.

తనకే తెలియకుండా చేసిన ఒక పొరపాటుకు తన జీవితం ఎందుకు వృధా అవ్వాలి?అసలు తను ఎందుకు ప్రేమించకూడదు? ప్రేమిస్తే తప్పేంటి?

అసలు ఈ జీవితంనుంచి తను ఎలా బయటపడుతుంది.
తెలీదు తనకి ఏమి తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే ప్రేమించడం.
కానీ పైన ఉన్న ఆ దేవుడు అందరికి ఎవరో ఒకరితో రాసిపెడతాడు.
కొన్ని సార్లు అది ఒకరితోనే కాకపోవచ్చు. అలాగే తనకి కూడా కార్తీక్ తో రాసిపెట్టివుంచాడేమో
 అందుకే అతన్ని కలిసిందేమో అనే ఆలోచనలతో
మీనాక్షి గడుపుతోంది.

అలా కాలం ఇంకొంచం ముందుకు కదిలింది.
ఇంకొక15 రోజుల్లో తన బీటెక్ కంప్లీట్ అవ్వబోతోంది.
అపుడే జరిగింది మీనాక్షి జీవితంలో తను ఎప్పటికి ఊహించని అనుకోని ఒక సంఘటన....

ఒక రోజు శేఖర్, మీనాక్షితో ఉండటం తనకి ఇష్టం లేదని
విడాకులు ఇప్పించమని చాలా గొడవ చేసాడు.
అసలు కారణం ఏమిటో తెలుసుకొందామని మీనాక్షి వాళ్ళ అమ్మ వారి సొంత ఊరు వెళ్లగా,
 అక్కడ శేఖర్ ఇంకొక అమ్మాయిని పెళ్లిచేసుకొని కనిపించాడు.

దానితో చేసేదేమీ లేక తన చేతులరా కూతురి జీవితాన్ని నాశనం చేసానని
 మీనాక్షి వాళ్ళ అమ్మ ఎంతగానో బాధపడింది.

అలా మీనాక్షి, శేఖర్ తో విడాకులు తీసుకొంటుంది.
అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు మీనాక్షి చాలా సంతోషించి, అలాగే వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తుంది.
తను పోగొట్టుకొన్నాననుకొన్న జీవితం మళ్ళీ ప్రాణం పోసుకొనట్టు అనిపించింది మీనాక్షికి.

చెప్పలేని ఆనందం తన కళ్ళలో మెరిసింది. అపుడే మీనాక్షికి,
ఇంకో 15 రోజుల్లో కాలేజి అయిపోతుందనే విషయం గుర్తొచ్చింది.

తనకి కార్తీక్ తో ఉన్న అనుబంధం కూడా.
ఈలోపే తన మనసులో ఉన్న ప్రేమని అతనికి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకొంది.

అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగవు.
అదే విధంగా అనుకోని కొన్ని సంఘటనలు అనుకోకుండానే జరుగుతాయి.
అలా ఒక రోజు కార్తీక్ నుండి ఫోన్ వచ్చింది మీనాక్షికి,
తనతో మాట్లాడాలి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న పార్కుకు రమ్మని చెప్పాడు. దాంతో మీనాక్షి ఇదే మంచి సమయం తన ప్రేమను తెలుపటానికి అనుకొంది.

అదే రోజు సాయంత్రం...


ఇంకా ఉంది*** ***
పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక 

*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.

*** ***

June 16, 2017

5:55 AM

మీనాక్షి - 1

'

నాలోని నాతో నేనే సంభాషించి, ఆలోచించి, 
కొత్తగా కొంచం బాధగా నా కథనే ఈ కథగా మలచి రాస్తున్నా
దీనికి "అంతం" లేకపోవచ్చు కానీ "ఆరంభం" మాత్రం నా ఆలోచనే
    
మీనాక్షి జీవితంలో ఒక పెద్ద పొరపాటుకు, 
తెలిసి తెలియనితనంతో తీసుకొనే నిర్ణయాలకు,
వేసే తప్పటడుగులు నిదర్శనం.

తను చేసిన పొరపాటు ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకోవటం అయితే, 
తీసుకొన్న నిర్ణయం పెళ్ళి, 
వేసిన తప్పటడుగులు అతనితో తన ఏడుఅడుగులు.

  మీనాక్షి అందరిలాంటి అమ్మాయే
కానీ
అందరికన్నా కొంచం అందం, 
మరికొంచెం అమాయకత్వం ఎక్కువగా ఉన్న అమ్మాయి.
తన జీవితంలో చేసిన తప్పేంటో తెలిసినా దానిని మార్చుకునే వీలులేదని అలాగే గడిపేస్తున్న ఒక పిచ్చి పిల్ల.
మనసులో దాచుకోలేనంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ తిరిగే ఒక మంచి అమ్మాయి.

చిన్నప్పుడే తన తండ్రిని పోగొట్టుకొవటం వలన
తనలోని ప్రేమనంతా  గోరుముద్దలుగా చేసి ఎంతో ముద్దుగా పెంచిన తన తల్లికోసం ఏదైనా చెయ్యటానికి ఎక్కువగా ఆలోచించదు.

అందుకే తన మావయ్య శేఖర్ ను పెళ్ళి చేసుకొమ్మని
దానివల్ల తను కోరుకున్నట్టుగానే బి.టెక్ చదివిస్తాడని
చెప్పటంతో ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది. 
శేఖర్, మీనాక్షి కన్నా 15ఏళ్ళు పెద్దవాడు పెద్దగా చదువుకుడా లేనివాడు. 
అతనికి లేని అలవాటు లేదు. ఉన్నదల్లా వాళ్ళ ఊరిలో కొంచం పొలం ఒక ఇల్లు మాత్రమే. 
మీనాక్షి వాళ్ళ అమ్మకి తమ్ముడంటే ఎంతో ఇష్టం
 తనకి మీనాక్షిని ఇచ్చి పెళ్లి చేస్తే తనకళ్ల ముందే ఉంటారని అనుకుంది. 
కానీ మీనాక్షికి వాళ్ళ మావయ్య అంటే ఇష్టంలేదు. 
అమ్మ మాట కోసం ఆమెని సంతోషంగా ఉంచడానికి ఒప్పుకుంది.

ఈ పెళ్ళి తను చేసుకోవటం వల్ల అమ్మని సంతోషపెట్టటమే కాదు బీటెక్ చదవాలనే కల కూడా నెరవేరుతుందని అనుకుంది.

అలా మీనాక్షి పెళ్ళి తన మావయ్య శేఖర్ తో బీటెక్లో చేరటానికి ముందే అయిపోయింది.
తనకి వైజాగ్ లోని కాలేజీలో సీట్ రావటంతో వాళ్ళ అమ్మతో కలిసి వైజాగ్ వచ్చింది.

శేఖర్ కూడా వాళ్ళతోపాటు వైజాగ్లొనే ఉంటూ, అప్పుడప్పుడూ ఊరుకి వెళ్లి పొలం తాలూకు పనులు చూసుకొని వచ్చేవాడు.
పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచి మీనాక్షిని చాలా రకాలుగా బాధ పెట్టటం మొదలు పెట్టాడు. తను శేఖర్ వల్ల ఎంత బాధపడుతున్నా అమ్మకి మాత్రం ఎపుడు ఏది తెలియనివ్వలేదు. పైకి చాలా సంతోషంగా ఉన్నట్టు నటించేది మీనాక్షి.
  
 ప్రతి కథకి ఒక మలుపు ఉన్నట్టే మీనాక్షి కథకి కూడా ఉంది. 
అది తన కలను నెరవేర్చుకోటానికి వేసే మొదటి అడుగుతో ముడిపడివుంది. 
తన జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి అనేది తాను ఇష్టపడి చేసుకోలేదు కనీసం తన కల నెరవేరబోతోందని ఎంతో సంతోషంతో మొదటి రోజు కాలేజీలో అడుగుపెట్టింది. తనకు ఎంతో ఇష్టమైన చదువును అంతకన్నా ఇష్టంగా చదవటం మొదలుపెట్టింది.

  ప్రతీ మనిషి జీవితం గొప్పగా మొదలయ్యేది తనని తనకన్నా ఎక్కువగా ప్రేమించే మనిషిని కలిసినప్పుడు,మీనాక్షి జీవితంలో అలాంటి పరిచయం కలగడానికి ఎంతో సమయం పట్టలేదు. 
ఆరోజు ఎప్పటిలాగే కాలేజీకి వెళ్ళింది కానీ ఎప్పుడూ తనకి కలగని ఒక కొత్త ఫీలింగ్ ఆరోజు కలిగింది
తనకే తనను కొత్తగా, అచేతనంగా నిలబెట్టిన అతని పేరు "కార్తీక్"


ఇంకా ఉంది...*** ***


పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక *** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.

*** ***