నా ఆవేశం




నా బిడ్డలకెందుకీ శాపాలు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఎందరో భారత తల్లుల కన్నీటి శోకం నుండి పుట్టినదే నా ఈ ఆవేశం. 
ముక్కుపచ్చలారని పసి పిల్లలని తమ సొత్తుల్లా దోచుకుంటున్న తోడేళ్లపై నా ఈ ఆవేశం. 
పసి పిల్లల్ని బలిచేస్తున్న రాక్షసానందం పై నా ఈ ఆవేశం. 
బిడ్డల్లో తల్లిని చూసే తండ్రులతో పాటు బిడ్డల్ని తల్లులని చేసే తండ్రులున్న ఈ సమాజం, మనం తిరుగుతున్న సమాజం పైన నా ఈ ఆవేశం. 
ఆచార్యదేవోభవ అన్న మాట పుట్టిన నేల పైన తప్పుడు ఆలోచనలతో గురువులు వ్యవహరిస్తున్న తీరు పై నా ఈ ఆవేశం. 
పుట్టుకలో ప్రేమని దాటి సుఖాన్ని చూసే మనుషులమన్న ముసుగులు కప్పుకున్న జంతువులపై నా ఈ ఆవేశం. 

యాసిడ్లు పొసే పైశాచికం పైన... 
పిల్లల జీవితాలతో వ్యాపారం చేసే వ్యాపారుల పైన... 
మన అహింసతో సాధించిన ఈ హింసాపూరితమైన స్వేచ్ఛ పైన...  
తల్లితండ్రుల్ని వదిలేసిన పిల్లల పైన... 
చదువుని వ్యాపారం చేస్తూ, భారత సంస్కృతిని వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ చదువుల పైన... 
వాళ్లకి ఆశ్రయమిస్తున్న రాజకీయ నాయకుల పైన... 

ఇలా కొన్ని వందల సార్లు... కొన్ని వందల పరిస్థితుల పైన నా ఈ ఆవేశం... 

గొంతు చించి, వేలు ఎత్తి ప్రశ్నించలేక... 
ఇలా పెన్ను పట్టి, ఒక్కో అక్షరాన్ని సమాజం పైన బాణంలా సంధిస్తున్న ఒక సామాన్యుడిని...