గణతంత్ర దినోత్సవం



26 జనవరి 2016
సమయం రాత్రి 10:30

నా పేరు కృష్ణ మూర్తి. మేము ఢిల్లీలో ఉంటున్న తెలుగు వాళ్ళం. సాయంత్రం ఏడింటికి రావలసిన నా కూతురు ఇంకా రాకపోవడంతో నాలో కంగారు మరింత ఎక్కువైంది. ఫోన్ ట్రై చేస్తున్నా కలవని పరిస్థితి. ఏ క్షణంలో ఏ వార్త వినవలసి వస్తుందోనని అనుక్షణం భయంతో గడుపుతున్న క్షణంలో టీవిలో హెడ్ లైన్స్ మొదలయ్యాయి. 

న్యూస్ హెడ్ లైన్స్ 

'ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న దేశం, ప్రజలని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం'

'దెశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని ప్రధాని వ్యాఖ్య, రానున్న కాలంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని భరోసా'

'ఢిల్లీలో యువతి పై అత్యాచారం, విషమంగా ఉన్న పరిస్థితి'

ఆ వార్త చూసి కాళ్ళు, చేతులు ఆడటం ఆగిపోయాయి. ఒళ్ళంతా చెమటలు పట్టి, ఏమి వినపడని పరిస్థితికి చేరుకున్నాను. గుండె కొట్టుకోవడం నెమ్మదించింది. చూపు మందగించింది. ఇంకాసేపట్లో నా శ్వాస కూడా ఆగిపోతుందేమో అనిపించింది. ఇంతలో ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో, ధైర్యం తెచ్చుకొని, శరీరం సహకరించపోయిన, ఓపిక తెచ్చుకొని వెళ్లి డోర్ తీసాను. 

నా కూతురు, నవ్వుకుంటూ డోర్ బయట నిలబడి ఉంది. ఒక్క క్షణం ఆగిపోయిన నా గుండె యధావిధిగా కొట్టుకోవడం ప్రారంభించింది. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. 

"సారీ నాన్న, క్యాబ్ టైర్ పంక్చర్ అయింది. ఫోన్ ఛార్జ్ అయిపోయింది. కాల్ చేసి చెపుదామంటే" అంటూ వివరణ ఇచ్చింది, నా చెమటలు చూసి నా పరిస్థితి అర్ధమైనట్టుంది. 

"సర్లేమ్మ, వెళ్లి పడుకో... ఇప్పటికే లేట్ అయింది" అనటంతో తన రూంలోకి వెళ్లిపోయింది. 

నేను పడుకుంటూ, తిరుగుతున్న ఫ్యాన్ వంక చూస్తుండగా నాలోనే నాకే ఒక ప్రశ్న. 

' ఆ టీవీలో చూపించిన అమ్మాయి స్థానంలో నా కూతురు ఉంటె ? తట్టుకోగలనా ? 
ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచిస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. 

ఏమిటి మనకి కర్మ, బయటకెళ్లిన కూతురు ఇంటికొచ్చేంత వరకు ఎందుకు మనకీ నరకం. 

దేశ గొప్పలు చెప్పుకుంటున్న మనకి ఏమిటి దౌర్భాగ్యం ?

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆడ కూతురుకి రక్షణ కరువైందా ?

ఎక్కడ మన స్వాతంత్రం ? ఇంకెక్కడ మన ప్రజాస్వామ్యం ?

15 ఆగష్టు 1947, మనకి స్వాతంత్రం వచ్చింది. 
26 జనవరి 1950 మా రాజ్యాంగం పుట్టింది అని చెప్పుకునే వాక్యాలుగా మిగిలిపోతున్నాయి. 

రాజ్యాంగం, తప్పులు చేసి తప్పించుకోడానికి కూడా పనికొస్తుందని తెలిసి భయమేస్తుంది. 

ఏదైతేనేం నా కుటుంబం బాగుండాలి. అందరి గురించి నాకెందుకు నా కూతురు ఇంటికొచ్చేసింది.'

*** ***

ఒక సగటు ఆడపిల్ల తండ్రి ఆవేదన ఇది. ఇలాంటి ఆడపిల్ల తండ్రులు ఎంతో మంది మన భారత దేశంలో, బయటకి వెళ్లిన కూతురు క్షేమంగా ఇంటికి వచ్చేంతవరకు భయపడుతూనే ఉండేవారు, ఉన్నారు... ఇక పై ఉంటారు కూడా. 

'దేవుడా రక్షించు నా ఈ దేశాన్ని' అని ఏడ్చిన తిలక్  
'దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు' అని గొంతెత్తి చాటిన గురజాడ. 
'జన గణ మంగళ దాయక జయహే ! భారత భాగ్య విధాత' అని భావి భారత పౌరుల గురించి కలం పట్టి ప్రపంచానికి వినిపించిన ఠాగూర్

వీళ్ళందరూ భారత భవిష్యత్తు బాగుండాలనే ఆశించారు. తమ శ్వాసనిచ్చారు.  

'ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన నాడే ఈ దేశానికీ స్వాతంత్రం వచ్చినట్టు' అని చెప్పిన మహాత్ముడు మన మధ్య లేడు. ఆయనే ఉండి ఉంటె 'తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష నుండి తప్పించుకోలేరని జనం నమ్మిన రోజే మన రాజ్యాంగం పుట్టినట్టు. ఆ రోజు నేను అందరితో కలసి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాను' అని చెప్పేవాడేమో.  

ఏదేమైనా సర్దుకుపోవడం, ఘనంగా వేడుకలు జరుపుకోవడం మన అలవాటు. 




గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు