నాకు తెలిసిన సంక్రాంతి


జనవరి 12
హైదరాబాద్ 


విశాఖపట్నం బస్సు కోసం మాదాపూర్ బస్టాండ్ దగ్గర ఎదురు చూస్తూ  నుంచున్నాడు కృష్ణ ప్రసాద్. రాత్రి ఎనిమిదిన్నరకు రావలసిన బస్సు తొమ్మిందింపావు అవుతున్నా రాకపోవడంతో కాస్త నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నా ఎక్కడ బయటపడకుండా తనలోనే అణగదొక్కుకుంటున్నాడు. 

కృష్ణ ప్రసాద్ ఇక్కడే పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు అరవై వేలు జీతం. అడపాదడపా ఇలా పండగలకు, పబ్బాలకు ఇంట్లో అమ్మ బలవంతంతో ఒకసారి ఇంటికెళ్లి వాళ్ళని చూసి వస్తుంటాడు.   

ఎట్టకేలకు బస్సు రావటంతో ఎక్కి కూర్చున్నాడు. 

'దీనమ్మ జీవితం ఒక్క సారి కూడా అమ్మాయి పక్కన దొరకదు సీట్' పక్క సీటులో కూర్చున్న పెద్దాయన్ని చూసి తనలో నిరాశ ఇంకా ఎక్కువైంది. 

బస్సు అక్కడనుండి బయల్దేరింది.

"ఏం చేస్తుంటావ్ బాబు?" అడిగాడు పక్కనే కూర్చున్న పెద్దాయన. 
"సాఫ్ట్ వేర్ ఉద్యోగమండి" చెప్పి మొహం తిప్పుకొని పాటలు వినటానికాని హెడ్ ఫోన్స్ పెట్టుకుంటున్నాడు. 
"ఏ ఊరు మీది ?" మళ్ళీ అడిగాడు పెద్దాయన. 
"శ్రీకాకుళం, కానీ వైజాగ్లోనే ఉంటున్నాం" విసుగ్గా బదులిచ్చాడు కృష్ణ ప్రసాద్. 
"పండక్కి వెళ్తున్నావా ఇంటికి ?" చేదస్థంగా అడిగాడు అయన.
"కాదండి, రేపు ఆగష్టు 15 కదా, ఇండిపెండెన్స్ డే చేసుకుందామని వెళ్తున్నాను" తనలో ఉన్న విసుగునంతా బయట పెట్టాడు. 

ఆ మాటలకు నొచ్చుకున్న పెద్దాయన మౌనంగా కిటికీ బయటకి చూడటం మొదలుపెట్టాడు. 

"అయినా, పండగయితే ఏముంది... ఆఫ్ట్రాల్ రెండ్రోజుల కోసం ఎక్కడెక్కడ ఏ పనుల్లో ఉన్నా ఇంటికి  రావాలంటారు... లాంగ్ వీకెండ్ వచ్చినపుడు వస్తానన్న కాదంటారు, వచ్చి ఎం చేస్తాం... టైం వేస్ట్ ఇంటికి వెళ్ళటం... చెపితే అర్ధం చేసుకోరు, చాదస్తం" ఇంట్లో వాళ్ళ మీద దాచి పెట్టుకున్న కోపాన్నంతా బయటకి మాట్లాడటం మొదలుపెట్టాడు.  

"తప్పు బాబు, పండగైతే ఏముంది అనకూడదు. ఇది మన పండగ ఇంట్లో అందరితో కలసి చేసుకునే పండగ" తన మాటలు నచ్చక, కలగజేసుకున్నాడు పెద్దాయన.
"అయినా ఏ సైన్టిఫిక్ రీసన్స్ లేని పండగలు చేసుకొని ఏం లాభం పెద్దాయన?" వెకిలిగా నవ్వుతు అన్నాడు కృష్ణ ప్రసాద్. 
"సైన్స్ లేదని మీరంటున్నారు... సైన్స్ పుట్టిందే మన సంస్కృతి నుండి అని మేమంటున్నాం" గర్వంగా బదులిచ్చాడు పెద్దాయన. 
"ఎం సైన్స్ ఉంది చెప్పు, తెలుసుకుంటాను" పొగరుగా అడిగాడు. 

"చెప్పు పెద్దాయన, ఏం సైన్స్ ఉంది సంక్రాంతిలో?" పెద్దాయన మౌనంగా ఉండేసరికి మళ్ళీ అడిగాడు. 

"ప్రతి అణువులో సైన్స్ ఉంటుంది బాబు, అలానే మన సంప్రదాయాల్లో, మన పండగల్లో" చెప్పటం మొదలు పెట్టాడు పెద్దాయన. 

"మీకు తెలిసిన పొంగల్... మా మకర సంక్రాంతి బాబు...  పెద్ద పండగ... రైతులందరూ ఆనందంగా జరుపుకునే పండగ" జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చెప్పడం మొదలుపెట్టాడు పెద్దాయన. 

"రైతులు జరుపుకుంటే మాకెందుకండి... ఊర్లల్లో మీరు చేసుకోవచ్చు కదా" కలుగజేసుకొని ప్రశ్నించాడు కృష్ణ ప్రసాద్. 

"మీ నాన్న ఎం చేస్తుంటారు బాబు ?" నవ్వుతూ అడిగాడు పెద్దాయన. 
"ఇంజనీర్"
"వాళ్ళ నాన్న ?" రెట్టించి అడిగాడు. 
మౌనంగా ఉండిపోయాడు ప్రసాద్. 

"రైతే కదా, అంటే ఇది నీ పండగే కదా... " అధికారంగా వస్తున్నాయి పెద్దాయన మాటలు. 

పెద్దాయన మాటలు కృష్ణ ప్రసాద్ ని కాస్త ఆలోచింపజేస్తున్నాయి. 

"మూడు రోజుల పండగ బాబు " మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు "కానీ ముప్పై రోజుల ముందు నుండే మొదలవుతుంది"

మౌనంగా వింటున్నాడు కృష్ణ ప్రసాద్. 

"ఇంటి బయట చదును చేసి, కళ్ళాపి జల్లిన నేల, ఆకాశానికి సంకేతం... దాని మీద పెట్టె  చుక్కలు, ఆకాశంలో ఉండే నక్షత్రాలకు సంకేతం, రోజుకొక క్రమంలో ముప్పై రోజులు ముప్పై ముగ్గులు పెడతారు... అది ఒత్తి ముగ్గు కాదు బాబు... ఆకాశంలో, గ్రహానక్షత్రాల స్థితి ఇలా ఉండచ్చేమో అని గీసే ఒక ఊహ చిత్రం... ముప్పై రోజులు ముప్పై ముగ్గులు పెట్టేవారు... ఆ రోజున ఆ ముగ్గు మాత్రమే పెట్టాలనే వారు, కానీ ఇప్పుడు రంగురంగుల ముగ్గులు... ఇంగ్లీష్ పదాలతో నిండిపోతున్నాయి"

"ఇక నెలవంక పెట్టింది మొదలు, ధనుర్మాసం పూర్తయ్యేదాకా వచ్చే హరిదాసు... సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా, హరి నామ స్మరణ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయనకి ఎదురెళ్లి తలపై ఉండే అక్షయ పాత్రలో బియ్యం వెయ్యాలి తప్ప, వాళ్ళు ఎక్కడా ఆగను కూడా ఆగరూ, ఎవరితోనూ మాట్లాడారు. వీళ్ళు బిక్షమెత్తుకునే బిచ్చగాళ్లు కాదు బాబు... ఇంటింటికి హరి నామాన్ని వినిపించి నాలుగు మంచి మాటలు నలుగురికి తెలియజేయాలని శ్రమించే విష్ణుమూర్తి భక్తులు... వాళ్ళని సాక్షాత్తు విష్ణుమూర్తి అవతరంగానే పరిగణించేవాళ్ళం... కానీ ఇప్పుడు వాళ్లొక బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారు"

"ఇక మూడు రోజుల్లో మొదట వచ్చే పండగ భోగి...  ఉత్తరాయన పుణ్య కాలం సంక్రాంతి తో ఆరంభమౌతుంది... మకర రాసి లోనికి సూర్యుడు ప్రవేశిస్తే, దానినే మనం మకర సంక్రాంతి అంటున్నాం. అప్పుడు మొదలయ్యే ఉత్తరాయణం, ఆరు నెలల పాటు కొనసాగి మళ్ళీ సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవిశించినపుడు పూర్తవుతుంది. మన శాస్త్రం ప్రకారం, ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం మానవుకలు ప్రాముఖ్యతను ఇస్తుంది. కనుక దేవతలను పూజించటానికి నువ్వు శుభ్రంగా ఉండటానికాని భోగి రోజు అబ్యాన్గన స్నానం చేస్తారు"

"ఉదయాన్నే లేచి నూనె రాసుకొని, నలుగు పెట్టుకొని స్నానం  చేయిస్తారు... నూనె కీళ్ళకు బలం... నలుగు పెట్టేటప్పుడు బలంగా రుద్దుతూ ఒకే క్రమంలో రాస్తూ ఉంటారు... అది ఎక్కడెక్కడో రక్త ప్రవాహంలో ఆగిపోయిన రక్తనాళాల కదలికకు తోడ్పడుతుంది"

"ఇక భోగి మంట.. మంచు, చలికి వచ్చే క్రిములను నాశనం చేస్తుంది... ఇక పై వేసవి వస్తుంది... సూర్యుడు మండుతూనే ఉంటాడు రోజు రోజుకి వేడి ఎక్కువవుతుంది అని చెప్పే సంకేతం కూడా అది"

"అదే రోజు సాయంత్రం జరిగే బొమ్మల కొలువు పిల్లలందరిని ఒకచోటుకి చేరుస్తుంది. ఇక పిల్లలపై పొసే భోగి పళ్ళు, విషుమూర్తికి ఇష్టమైన పళ్ళు. విష్ణుమూర్తి బదిరి క్షేత్రంలో ఉంటున్నపుడు ఈ పళ్లనే తిని పెరిగేవాడట, అందుకని మన ఇతిహాసాల్లో ఈ పళ్లకు ప్రాధాన్యం ఉంది"

"రెండో రోజు సంక్రాంతి, అదే మకర సంక్రాంతి... పెద్ద పండగ... రైతుల పంట చేతికి వచ్చే సమయం. వ్యవసాయ పనులు పూర్తవుతాయి కదా, రైతులందరూ విశ్రాంతి తీసుకునే సమయం. మనం దానం ఇచ్చి స్వర్గస్తులైన పెద్దవాళ్ళని స్మరించుకునే సమయం. గృహాలన్నీ పచ్చని మామిడి తోరణాలు... ఎడ్ల పందాలు... గాలిపటాలు... కోడి పందాలు... ఇవన్నీ కష్టపడి పంట పండించి, పంట చేతికొచ్చినపుడు రైతు కుటుంబ సభ్యులతో కలసి  సరదాగా కోలాహలంగా చేసుకునే ఆట విడుపు  "

"మనమిలా బ్రతకడానికి తోడ్పడిన సమస్తానికి కృతజ్ఞత తెలియజేసే పండగ కనుమ. పంట పండించటానికి సహాయపడిన పశువులకు, వాటిని నడిపించిన రైతులకు, రైతు కూలీలకు, పాలేరులకు, ఇతర పని మనుషులకు కృతజ్ఞతను ప్రదర్శించే రోజు ఈ కనుమ రోజు... ఆ రోజు పశువులను అలంకరించి, వాటికి కూడా ఆటపాటలు అవసరమని గుర్తించి ఎడ్ల పందాలు, కోడి పందాలు పెడుతూ ఉంటారు"

"ఇలా చెప్పుకుంటూ పోతే చాల సుదీర్ఘ చరిత్ర ఉంది బాబు మన పండగలకు, సంస్కృతికి

'పల్లెటూరు మన భాగ్యసీమరా 
పాడి పంటలకు లోటులేదురా 
మంచితనం, మమకారం 
మనిషి మనిషిలో కనపడునురా'

అన్నాడొక సినీ కవి... 
మనలో గుడ్డి నమ్మకాలూ ఉన్నాయేమో గాని, గుడ్డి సంప్రదాయాలు లేవు బాబు"

"రైతే దేశానికీ వెన్నుముక అన్నాడొక మహాత్ముడు... అలాంటి రైతు ఆనందంగా చేసుకునే పండగ బాబు ఇది, అంత ప్రాముఖ్యం ఉన్న రైతులు ప్రతి కుటుంబంలో ఉండే ఉంటారు... మనం చెయ్యాల్సింది ఏమి లేదు, ఒక్క రోజు వాళ్ళని, మన కుటుంబంలో ఉన్న రైతులని కలసి, నీ శ్రమ అభినందనీయం అని ఒక కను సైగ చాలు"

"ఇప్పటి తరాన్ని చూసి, మన సంప్రదాయాలు కొంచమైనా తరువాత తరాలకు అందుతాయా అనే భయం వేస్తుంటుంది బాబు అప్పుడప్పుడు... ఆ రోజుల్లో ఇలా చేసేవారంట అని ఇప్పుడు మనం పురాతన నాగరికతల గురించి చదువుకున్నట్టే, మన సంప్రదాయాలను తరువాతి తరం వాళ్ళు చదువుకోవలసి వస్తుందేమో అని సందేహం కలుగుతూ ఉంటుంది"

"మనం గొప్పగా చేయాల్సిందేమి లేదు, మన తండ్రులు మనకి నేర్పించిన కొన్ని అలవాట్లు మనం మన పిల్లలకి నేర్పగలిగితే సరిపోతుంది... వీళ్లది గొప్ప చరిత్రరా అని మనల్ని చూసి చెప్పుకుంటున్న విదేశీయులు, భారతదేశానికి ఒకప్పుడు గొప్ప చరిత్ర ఉండేది అని చెప్పుకునే రోజు రాకూడదనేదే నా ఆశ బాబు"

"నన్ను అపార్ధం చేసుకోకు బాబు, ఏదో కొడుకు వయసు కదా మందలింపుగా మాట్లాడేసాను

అంతా చెప్పి పడుకుండిపోయాడు ఆ పెద్దాయన.

ఇదంతా విన్న కృష్ణ ప్రసాద్, తనలో తానే అంతర్మధనానికి గురయ్యాడు... రాత్రంతా పెద్దాయన మాటలు వినపడుతూనే ఉన్నాయి. 

ఉదయం బస్సు విశాఖపట్నం చేరుకుంది. 

"నన్ను క్షమించు పెద్దాయన, కోప్పడ్డాను" అన్నాడు, తప్పు తెలుసుకున్న కృష్ణ ప్రసాద్ బస్సు దిగుతూ ముందునే ఉన్న పెద్దాయనతో. 

చిన్న చిరునవ్వుతో పెద్దాయన అక్కడనుండి వెళ్ళిపోయాడు.




మీ అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు