జీవిత కథలు - 2



మేము నెమ్మదిగా పక్కనున్న గడ్డిలో నడుస్తూ శత్రువు కోసం వెతుకుతుండగా, సడన్ గా శత్రువుల్లో ఒకరు మెషిన్ గన్ తో మా మీద దాడి చెయ్యటం ప్రారంభించారు. ఆ మెరుపు దాడినుండి తప్పించుకొని, తిరుగు దాడి చెయ్యగా, అవతల వైపు సైన్యంలో ఇద్దరు సైనికులు మరణించినట్టు తెలిసింది. వెనువెంటనే నాకొక పెద్ద శబ్దం వినపడింది.

"లెఫ్టినెంట్, లెఫ్టినెంట్..." ఎవరో పిలవడం నాకు తెలుస్తుంది కానీ, నేను తిరిగి వాళ్ళకి బదులివ్వలేకపోయాను. 

అవును ఆ మెషిన్ గన్ దాడిలో నా శరీరం గాయపడింది. ఇక అక్కడనుండి జరిగినదంతా నాకు తెలుస్తూనే ఉంది కానీ నేను స్పందించే స్థితిలోలేను. ఇద్దరు మెడికోస్ నన్నొక స్ట్రెచర్ పై మెడికల్ రూంకి తీసుకోని వెళ్లారు. డాక్టర్ నాకు ఫస్ట్-ఎయిడ్ చేసి అక్కడనుండి ఆ దగ్గరలో ఉన్న ఆర్మీ హాస్పిటల్ కి తీసుకోని వెళ్లారు. అక్కడ నాకులానే పదుల సంఖ్యలో యుద్ధంలో గాయపడిన సైనికులు. డాక్టర్ చికిత్సమొదలవగానే నేను స్పృహ కోల్పోయాను. 

"లెఫ్టినెంట్, లెఫ్టినెంట్ లేవండి..." అక్కడున్న నర్స్ నన్ను లేపుతుండడటంతో మెలకువ వచ్చింది. "మీరు తక్షణమే చికిత్స కోసం ప్లేన్ లో ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి... ఆలస్యమైతే మీ ప్రాణానికే ప్రమాదం". నాకు ఒక్క నిమిషం ఏమి అర్ధం కాలేదు, అంతకు ముందు వరకు జరిగినదంతా అలా కళ్ళ ముందు మెదలటం మొదలైంది. కాస్త స్పృహతోనే లేచి చూసుకునేసరికి నా జేబులో ఉండాల్సిన ఫోటో కనిపించకుండా పోయింది. 

"నాకు ఎల్లెన్ ఫోటో ఇచ్చేంత వరకు నేను ఇక్కడనుండి వెళ్లటంలేదు" అన్నాను నర్సుతో "నా ప్యాంటు ప్యాకెట్లోనే ఉండాలి ఇంతకుముందు వరకు"

"సరే, ఉండండి నేను వెతికి తీసుకొస్తాను" అని చెప్పి పరుగు పరుగున అక్కడనుండి వెళ్ళింది. నర్స్ నన్ను బలవంతంగా పంపించగలదు , కానీ ఆలా చెయ్యకుండా తను ఎల్లెన్ ఫోటో వెతకడానికాని వెళ్ళింది. ఇంకాసేపటికి నేనున్న టెంట్ లోనికి పరిగెత్తుకుంటూ వచ్చి, "ఇదిగో దొరికింది" అంటూ ఎల్లెన్ ఫోటో నాకిచ్చింది. 

తను ఎలా తీసుకొచ్చిందో, ఆ ఫోటో ఎక్కడ పడిపోయిందో నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఆ ఫోటో నాకున్న ఆఖరి గుర్తు. ఆ యుద్ధం జరిగి 69 సంవత్సరాలు అవుతున్నా, ఇప్పటికి  నా ప్యాకెట్లోనే ఉంది ఆ ఫోటో. 

నా పేరు జేమ్స్. నా భార్య ఎల్లెన్ యాక్సిడెంట్లో చనిపోయి 71 సంవత్సరాలవుతుంది. 



'ప్రేమ యుద్ధంలో ఉంటుంది, ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంద'ని ఎక్కడో ఒక సినీ కవి ప్రస్తావించినట్టు. 

ప్రేమంటే ఇద్దరు వ్యక్తులు కలిసుండటం కాదు, ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడం. 

ఇది ఒక సైనికుడి కథ కాదు, చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా భార్య ఫోటోను వదులుకునే సాహసం చెయ్యని ఒక భర్త కథ. పెళ్ళైన సంవత్సరానికే భార్య చనిపోయినా, 71 సంవత్సరాలుగా తన స్మృతులతో జీవితంతో పోరాడుతున్న ఒక వీర సైనికుడి కథ.  




ఆధారం: readers digest 



మీ జీవితంలో జరిగిన కథలు గాని, మీరు తెలుసుకున్న కథలు గాని అందరితో పంచుకోవాలనుకుంటే... మీ కథని క్లుప్తంగా రాసి మాకు మెయిల్ చెయ్యగలరు.
మా మెయిల్ ఐడీ : santhakamofficial@gmail.com