జీవిత కథలు - 3



జనవరి 2015
గొంగొలి గ్రామం
ఉత్తరప్రదేశ్ 



దారితప్పిన ఒక పెద్దావిడ, నీరసంగా దిక్కుతోచక సంచరించడం ఆ గ్రామ ప్రజల కంటపడింది. ఆవిడ చాల దయనీయమైన స్థితిలో, దేనికోసమో వెతుక్కుంటూ వెళ్లిపోతుండడం గమనించిన ఆ గ్రామస్తులు, తనని ఒక దగ్గర కూర్చోబెట్టి, వివరాలు కనుక్కునే ప్రయత్నం చేసారు. 

కానీ ఆమె ఎవరో, ఎందుకు తిరుగుతుందో, దేనికోసం వెతుకుందో తనకే తెలియని స్థితిలో ఉన్న ఆవిడ, ముక్క కూడా మాట్లాడలేక, చుట్టూ గుముగూడిన గ్రామస్థులతో చాల ఇబ్బంది పడుతుంది. ఒక యువకుడు ముందుకొచ్చి,

"ఈవిడని నేనింతకముందు చూసాను" అన్నాడు. 
"ఎప్పుడు చూసావ్?" అడిగాడు అక్కడున్న ఒక పెద్దాయన. 
"ఒక రోజు మన గ్రామంలో, ఒక పెద్దాయన తన భార్య కోసం ఒక ఫోటో పట్టుకొని వెతుకుంటూ వచ్చాడు... మీకెవరికైనా గుర్తుందా?" అడిగాడు ఆ యువకుడు. 
"అవును, కనపడితే కాల్ చెయ్యమని తన నెంబర్ కూడా ఇచ్చినట్టు గుర్తు" కల్పించుకొని మాట్లాడాడు ఇంకొక యువకుడు. 
"ఈవిడ ఆ ఫొటోలో ఉన్న ఆవిడలనే ఉందని నా నమ్మకం" వ్యక్తం చేసాడు మొదటి వాడు. 

ఆ వెతుక్కుంటూ వచ్చిన పెద్దాయనకి ఫోన్ చెయ్యగా, సాయంత్రానికల్లా అయన గ్రామానికి చేరుకున్నాడు. 

ఆవిడని చూసిన మరుక్షణం, ఆయన నిల్చున్న దగ్గరే మోకాళ్ళమీద పడిపోయాడు... కళ్ళలో కన్నీరు... కాదది కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు, పంతొమ్మిది నెలలుగా గుండెల్లో అడుగంటిపోయిన ఆనందం ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిన అలలా, ఆయన కంట నీటి రూపంలో బయటపడింది. 

లేచి పరిగెత్తుకుంటూ ఆ పెద్దావిడ దగ్గరకొచ్చి, గట్టిగ హత్తుకొని తనని తానే మైమరచిపోతున్నాడు. ఆ పెద్దాయన కళ్ళలో ఆనందం చూస్తున్న గ్రామస్థులు కూడా తామొక జంటని కలిపినందుకు చాలా సంతోషించారు. 

ఏమైందని అక్కడున్న వారు అడగడంతో, ఆ పెద్దాయన కళ్ళు తుడుచుకుంటూ జరిగినది వివరించడం మొదలుపెట్టాడు... 

"నా పేరు విజయకాంత్. ఈవిడ మా ఆవిడ లీల. 2013లోతీర్థయాత్రలకని ఉత్తరాఖండ్ వెళ్ళాము. అక్కడ వరదలలో కొట్టుకుపోయిన వాళ్లలో ఈవిడ కూడా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన చనిపోయినవారి జాబితాలో లీల కూడా ఒకరు. కానీ నాకు తను చనిపోయిందని నమ్మకం కలగలేదు. ఆ రోజు నుండి ప్రతి రోజు గ్రామాలన్నీ వెతుకుంటూ తిరుగుతున్నాను. ఇప్పటికి పంతొమ్మిది నెలలవుతుంది. ఇన్నాళ్ళకి నా నమ్మకం నిజమైంది. మా ప్రేమ బ్రతికింది"




ఆధారం: The Better India 




మీ జీవితంలో జరిగిన కథలు గాని, మీరు తెలుసుకున్న కథలు గాని అందరితో పంచుకోవాలనుకుంటే... మీ కథని క్లుప్తంగా రాసి మాకు మెయిల్ చెయ్యగలరు.
మా మెయిల్ ఐడీ : santhakamofficial@gmail.com