తాను - నేను


నా 'తన పరిచయం' కాంటెస్టులో ఎంపికైన మూడవ కథ

ప్రేమంటే ఏంటి?
ప్రశ్న చాలా చిన్నది కదా?

కాని, సమాధానం తెలియాలంటే?
అది అనుభవిస్తే గాని తెలియదని అందరూ అంటుంటారు
అలాంటి అనుభవమే నా జీవితంలో కూడా ఎదురైంది 

ఆ కథే
ఈ 
తాను - నేను 

*** ***

ప్రేమ ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధమవుతుంది. ఎవరి వివరణలు వారివి
కానీ, నాకు ఎదురైన అనుభవంలో ప్రేమంటే ఒక అనుభూతి మాత్రమే కాదు. 
మరొక గుండె చప్పుడు

నా పేరు శశిరేఖ, అందరిలానే ప్రేమను వెతుకుతున్న ఒక అమ్మాయిని . 
అలా వెతుకుతున్న ప్రేమ అంత సులభంగా దొరకలేదు, అలా అని మరీ కష్టపడనూ లేదు. 
అదొక అందమైన ప్రమాదం. 

నేనొక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాను. ఆఫీసులో నన్ను చూసి కొంత మంది 'చిన్న పిల్ల' అంటారు. మరికొంత మంది 'ఫైర్ బ్రాండ్' అంటారు. కానీ అసలు నేనేంటో, నా మనస్తత్వం ఎలాంటిదో 'తను' నాకు పరిచయమయ్యేవరకు తెలియనే లేదు. 


31 జనవరి 2015

ఆఫీస్ పనుల్లో చురుగ్గా పాల్గునేదానిని. ఆ క్రమంలోనే ఒకరోజు, వాట్సాప్లో ఆఫీసుకి సంబంధించిన ఒక గ్రూప్లో చర్చ నడుస్తున్న సమయంలో నేను చేసిన వ్యాఖ్యని వ్యతిరేకిస్తూ ఒక మెసేజ్ వచ్చింది. 
నేను చెప్పేది తనకి అస్సలు నచ్చలేదని నాకు అర్ధమైంది. అంతలోనే నాలో కోపంతో కూడిన అసహనం. 

తనెవరో తెలుసుకోవాలనిపించింది. 
ఫేసుబుక్లో ప్రొఫైల్ చూసా... తన పేరే అభిమన్యు. వేరే ఏదో బ్రాంచ్లో పని చేస్తున్నాడు.
ఒకటే జిల్లా అని మాత్రమే గుర్తుపెట్టుకున్నాను. 
*** ***

ఆఫీసు పని, ఇంటి పని... ఎంత పనిలో ఉన్నా కూడా, ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రేమ గురించి  ఆలోచనలు నన్ను చుట్టుముట్టెవి, నా జీవితంలో ఎప్పుడు ఎలా వస్తుందో అని.

ఆరోజు కూడా రోజూలానే ఆఫీసుకి వెళ్ళాను. మరుసటి రోజు మీటింగ్ ఉందని బాస్ నుండి కాల్ వచ్చింది.
ఆ మీటింగ్స్ నాకు కొత్తేమి కాదు, కానీ ఆ రోజు ఒక మెరుపులాంటి ఆలోచన నాలో మొదలైంది ...
'అభిమన్యు కూడా వస్తాడా?'

8 ఫిబ్రవరి 2015

మీటింగుకి వెళ్లాను. తనని చూస్తానా అనే ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చెయ్యసాగాయి. అలా ఆ ఆలోచనల్లో ఉండగానే తనొచ్చాడు. కళ్ళు సూటిగా, నడక స్థిరంగా, జుత్తు నిర్లక్ష్యంగా ఎడమ చెయ్యి ప్యాంటు జేబులో పెట్టుకుంటూ, హుందాగా నడుస్తూ లోపలి వచ్చాడు.

మీటింగ్ స్టార్ట్ అయింది. నేను స్టేజి మీద అందర్నీ చూస్తూ మాట్లాడుతుండగా, ఒక దగ్గర నా కళ్ళు ఆగిపోయాయి. 'తన' కళ్ళు నన్ను చూసి చిలిపిగా నవ్వుతుండడం గమనించాను. అంతే నా మాట తడపడిపోయింది. మైండ్ కి మాటకి లింక్ కట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నానో, ఎలా మాట్లాడుతున్నానో తెలియని అయోమయం. ఎలాగోలా స్పీచ్ పూర్తి చేసి, వెళ్లి కూర్చున్నాను. కుర్చున్నాననే మాటే గాని మనస్సంతా ఒకలాంటి ఆందోళన. మొదటిసారిగా ఏదో జరుగుతుంది నాలో. ఏంటిదంతా అని నాలో నాకే ఏదో తెలియని ఆలోచన.

ఇంతలో తను స్టేజి మీద మాట్లాడుతుంటే, చూస్తూ ఉండిపోవడమే నా వంతైంది. ఆపకుండా మాట్లాడుతున్నాడు. మాట్లాడేది చాలా బావుంది. తన ఆర్గ్యుమెంట్ నిజమే కదా అనిపించేంతలా. కళ్ళలో రౌద్రం, మాటల్లో కటువు. కాని అది కూడా నాకు నచ్చేట్టుగా, నాకు కావలసినట్టుగా.
నా ఆలోచనల్లో మార్పుకి నాకే ఆశ్చర్యం. ఒకప్పుడు నచ్చని అతని మాటలే, ఇప్పుడు నచ్చేసేటట్టు.

రెండు గంటల్లో మీటింగ్ ముగిసింది. ఇంటికెళ్ళటానికి సర్దుకుంటున్న సమయంలో నాకు తెలియకుండానే నా కళ్ళు తనకోసం వెతకసాగాయి. అంతలోనే హఠాత్తుగా వెనుక నుండి, "హాయ్" అని ఒక స్వరం వినిపించింది. ఆ గొంతులో ఏదో తెలియని ఆప్యాయత, ఆ స్వరం విన్న నాలో ఏదో అలజడి. వెనక్కు తిరిగి చూస్తే ఒక చిన్న చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు.  గుండెవేగం రెట్టింపయింది, నా గుండె చప్పుడు నాకే వినిపించేంతలా.  అదేం చిత్రమో మరి, నాతో ఇంకో గుండె లయ కలుపుతున్నట్టుగా అనిపించింది.

మీటింగ్లో నిప్పులు చెరిగిన ఆ కళ్ళు, చిలిపిగా చూస్తూ నవ్వుతుండటం, మాటలని వరదలా పారించిన ఆ పెదాలు, వణకడం చూడటానికే చాలా గమ్మత్తుగా అనిపించింది.
ముందు తనే చొరవ తీసుకొని, "నా పేరు అభిమన్యు" అని అన్నాడు.
   నేను కూడా వెంటనే తేరుకొని, "శశిరేఖ" అన్నాను.
ఇంకేదో మాట్లాడుతాడని ఎదురుచూస్తుంటే, "ఓకే. సి యు లేటర్" అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు.

ఆ చర్యకి నా మనసు ఒక్కసారి చివుక్కుమంది. ఇంటికెళదామని బయలుదేరుతున్న సమయంలో నా ఫోనుకి వచ్చిన మెసేజ్ నాలో ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలగలిపి తీసుకొచ్చింది. 

'హాయ్, అర్ యు సాటిస్ఫయిడ్? - అభి' చెప్పలేని ఆనందం ఒకవైపు, చిరు కోపం ఒకవైపుతో రిప్లై ఇచ్చాను, 'దేని గురించి?'

అయినా ఇచ్చానన్న మాటే గాని, ఆ  క్షణం నుండి, నా కళ్ళు, నా మనసు, నా ఆణువణువూ, తను పంపే మెసేజ్ కోసమే ఎదురు చూశాయి, కొంత సేపటికి రిప్లై వచ్చింది, 'అబౌట్ థిస్ సెషన్'
ఒక అమ్మాయితో మాట్లాడుతూ, మీటింగు సెషను అంటాడేంటి అనే కోపంతో, 'నగేష్ సార్, స్పీచ్ కోసం వచ్చాను. టు బి ఫ్రాంక్' అని రిప్లై ఇచ్చాను.

కాసేపటికి, 'ఫస్ట్ టైం, ఐ యామ్ టాకింగ్ టు యు పర్సొనల్లి. ఫ్రెండ్స్?' అని మెసేజ్ చేసాడు. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న నేను వెంటనే ఫ్రెండ్స్ సింబల్ పంపించేసాను. ఎన్నో ఆలోచనలతో, ఎంతో ఆనందంతో గడిచిపోయింది ఆ రోజు.

ఫ్రెండ్స్ సింబల్స్ పంపించినంతమాత్రాన ఫ్రెండ్స్ అయిపోలేరు, ఒక మేజిక్ జరగాలి. చూసినంత మాత్రాన ప్రేమ పుట్టదు. ఇద్దరిలో అర్ధం చేసుకునే మనసుండాలి. ఒకరి ఆలోచనలకూ ఒకరు తోడుగా నిలబడాలి.
ఎం జరిగినా, నాకు తానున్నాడనే నమ్మకం ఇవ్వగలగాలి.  అలాంటి మేజిక్ మా ఇద్దరి మధ్య అలా మొదలైంది. అప్పటినుండి తన మెసేజెస్ తో మొదలయ్యే నా రోజు, తన జ్ఞాపకాలతో ముగిసేది.

ఇది మా పరిచయం.

తాను - నేను
అభి - శశి


*** ***
పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక 



*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.

*** ***