నిజంగానే ప్రేమలో ఉన్నానా?







ఒక చిన్న కథ రాసే ప్రయత్నంలో ఉండగా, 
సంతకం పేజీలో వచ్చిన ఒక ప్రశ్న నన్ను నిజంగా ఆలోచించేలా చేసింది. 

అందమైన కథలతో పాటు ఆలోచింపజేసే మాటలు కూడా 
పాఠకులకి అందించడం సంతకం ముఖ్య ఉద్దేశం కనుక, 
ఆ ప్రశ్నకి ఈ సమాధానం ఒక్కరినైనా ఆలోచించేలా చేస్తుందనేది నా నమ్మకం. 

అసలు నేను ప్రేమలో ఉన్నానో లేదో గ్రహించడం ఎలా?


అని మీనుండి వచ్చిన ప్రశ్నకు నా స్పందనే ఈ రచన

'ప్రేమలో ఉన్నానా?'

నిజంగా ప్రేమలో ఉన్నానా?

ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి జీవితంలో కనీసం ఒక్కసారైనా ఎదురుపడి ఉంటుంది.


ప్రేమ

మనిషిని కదిలించే శక్తీ ఆకలికి ఉంటే,
మనసుని కదిలించే శక్తీ కేవలం ప్రేమకు మాత్రమే ఉందనేది నా గట్టి నమ్మకం. 

'ప్రేమలో ఉన్నానా?' అని మనకి ఎదురయ్యే ప్రశ్నకు,
మనలో ఎక్కువ మంది, తమకి తాము వెంటనే ఇచ్చుకునే సమాధానం 'అవును'.

ఆ 'అవును' అనే పదం వెనుక దాగిఉన్న ఆలోచన,
ఎక్కువమందిలో తక్కువగా ఉంటుంది
తక్కువమందిలో మాత్రమే ఎక్కువగా ఉంటుంది

ఆ 'అవును' అనే ఒక్క పదం, అప్పటినుండి జీవితంలో కొన్ని మార్పులు తీసుకొస్తుంది.
కానీ మనం ఎంత అలోచించి, 'అవును' అనుకుంటున్నామో మనొక్కరికే తెలుస్తుంది.



ఇక మన ప్రశ్న విషయానికి వస్తే,

నేను ప్రేమలో ఉన్నానని ఎలా గ్రహించాలి?

ప్రేమంటే,

నమ్మకం
జీవితం 
దాంపత్యం
ధైర్యం

ఇలా, ప్రేమకు ప్రతి ఒక్కరి నిర్వచనం ఒక్కోలా ఉంటుంది. 
అందుకేనేమో, ప్రేమ చాల సున్నితమైనదని చెప్తుంటారు.

ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా,

ప్రేమ మనకు సంబంధించినది
మన మనసుకి సంబంధించినది
మన మనసుకి మాత్రమే సంబంధించినది.

ఎందుకంటే ప్రేమ, ఒకరు చెప్తే తెలుసుకునేదో, ఒకరు చూపిస్తే చూసేదో కాదు...
మనకి మనం అనుభవించి తెలుసుకోవలసినది.


మనం పుట్టకముందే అమ్మ ప్రేమలో పడ్డాం,
పుట్టిన మరుక్షణం నాన్న ప్రేమలో కూడా పడ్డాం,
ఇలా అనుక్షణం ప్రేమిస్తున్న వారు, ఎవరో ఒకరు మన చుట్టూనే ఉంటారు.

ఒక మనిషి ప్రేమలో ఉన్నప్పుడు, సినిమాల్లో చూపించినట్టుగా
ఆకాశంలో మెరుపులు ఉండవు,
గుండెల్లో ఉరుములు ఉండవు,
గుడి గంటలు మొగవు,
 గాలికి పంటలు ఊగవు,
అలలు ఉవ్వెత్తున ఎగిసిపడవు,
పావురాలు ఆకాశాన ఎగిరిపోవు

కానీ, ఇప్పుడు మనం చదవబోయే చిన్న ప్రేమ కథ,
మనం నిజంగానే ప్రేమలో ఉన్నామో లేదో
మనకొక సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తుందనే ఆశిద్దాం.

కథ


ఒక రోజు యువకుడు ఒక స్వామిజి దగ్గరకు వెళ్లి, "స్వామి, ప్రేమంటే ఏంటి? అసలు నేను ప్రేమలో ఉన్నానో లేదో ఎలా తెలుసుకోవాలి?" అని ప్రశ్నించాడు. 
దానికి ఆ స్వామిజి, "ఎంత దూరం నుండి వచ్చావు నువ్వు?" అని అడిగాడు. 
"చాల దూరం నుండే వచ్చాను స్వామి" అన్నాడు ఆ యువకుడు. 
"ఎలా వచ్చావు?" మరొక ప్రశ్న వేసారు స్వామిజి. 
"నడుచుకుంటూ వచ్చాను స్వామి" అన్నాడా యువకుడు. 

"నీ ప్రశ్న నాకు నచ్చింది. నీ ప్రశ్నకు నేను చెప్పేకన్నా, నువ్వు అనుభూతి చెందితేనే, సరైన సమాధానం దొరుకుతుంది" అన్నారు ఆ స్వామిజి, "నువ్వు ఏ దారిలో వచ్చావో, అదే దారిలో నడుచుకుంటూ వెళ్ళిపో, నీ గమ్యాన్ని నువ్వు చేరుకోడానికి కొన్ని నీకు సహాయపడతాయి. అవేంటో రేపొచ్చి నాకు చెప్పు
"సరే స్వామి" అంటూ ఆ యువకుడు అదే దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 

దారిలో సహాయం చేసే వారి కోసం చూస్తూ నడుచుకుంటూ గమ్యం దిశగా బయలుదేరాడు. కానీ ఎవరు సహాయపడటానికి రాలేదు. 

మరుసటి రోజు వెళ్లి, "స్వామి, నాకు సహాయపడేందుకు ఎవరు రాలేదు. నా సొంతంగానే ఇంటికి చేరుకున్నాను" అన్నాడు. 
దానికి ఆ స్వామిజి, "అయ్యో, ఈరోజు ప్రయత్నించు, వస్తారు కచ్చితంగా" అన్నారు. 

సరే అని, ఆ యువకుడు ఆ రోజు కూడా ఎవరి సహాయం లేకుండానే ఇంటికి చేరుకున్నాడు. 

తరువాతి రోజు అదే జరిగింది. 

నాలుగోరోజు కోపంగా ఆ యువకుడు స్వామిజి దగ్గరకు వచ్చి, "స్వామి నాతో ఆటలాడుతున్నారా? ఎవరు రావటంలేదు" అంటూ గట్టిగా మాట్లాడాడు.

దానికి ఆ స్వామిజి, "చూడు బాబు, ఇక్కడనుండి మీ ఇల్లు చాలా దూరమన్నావు. నీ దారిపొడుగునా నీకు నడవటానికి నేల సహాయపడింది. ఆకాశం నీకు వెలుతురునిచ్చి నిన్ను గమ్యాన్ని చేర్చింది. గాలి నీకు ఉపిరినిచ్చి సహాయపడింది. నీ ఒంట్లో ఉన్న నీరు నీకు శక్తీని ఇచ్చి నువ్వు నువ్వు గమ్యాన్ని చేరుకునేలా చేసింది. చీకటిలో నిప్పు నీకు దారి చూపించింది. 

కేవలం ఇక్కడనుండి మీ ఇంటికి చేరుకోడానికి ఇవన్నీ ఎలా సహాయ పడ్డాయో... 

జీవితమనే ప్రయాణంలో గమ్యాన్ని చేరుకోడానికి వీటితో పాటు ప్రేమ కూడా అవసరం. 

ప్రేమ కూడా ఇంతే... 

మనకు కనిపించదు... కానీ ఎప్పుడు మన చుట్టూనే ఉంటుంది. 

నేలలా నీ బరువు మోస్తూ ఉంటుంది... 
ఆకాశంలా, ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంటుంది... 
గాలిలా... నీకు ఊపిరినిస్తుంది... 
నీటిలా... నీకు శక్తిని చేకూరుస్తుంది... 
చీకటిలో ఉండిపోతున్న నీకు, నిప్పులా మారి దారిని చూపిస్తుంది."

స్వామిజి మాటలకు ఆలోచనలో పడిన ఆ యువకుడు, "సరే స్వామి, నాకు అర్ధమైంది. మరి నేను ప్రేమలో ఉన్నానో లేదో ఎలా తెలుసుకోవాలి?" అని అమాయకంగా ప్రశ్నించాడు.
దానికి స్వామిజి నవ్వుతూ అక్కడనుండి వెళ్ళిపోయాడు.
స్వామిజి నవ్వుని ఊహించని ఆ యువకుడు, ఆలోచనలో పడ్డాడు.


***

స్వామిజి నవ్వు వెనుక పెద్ద అర్ధమే దాగి ఉంది. 

నేను ప్రేమలో ఉన్నానా? 
అనే ప్రశ్న మనకి మనం ప్రశ్నించుకుంటే, సమాధానం దొరుకుతుందేమో గాని,

నేను ప్రేమలో ఉన్నానని నాకెలా తెలుస్తుందని ఎదుటివారిని ప్రశ్నించడం అమాయకత్వమే అవుతుంది. 

మన ఆకలి ఎదుటివారికి తెలియనట్టే, మన ప్రేమ భావం కూడా తెలియదు. 
ఒకవేళ మనం చెప్పినా అది ఒక కథలానే ఉంటుంది తప్ప, 
ఆ భావం లోతు మన ఒక్కరికే తెలుస్తుందనేది నా అభిప్రాయం

'మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా
మృదువైన స్వరమా ప్రేమ, పదునైన శరమా ప్రేమ, బదులీయగలవా దైవమా?'
అని ఒక సినీ రచయిత రాసిన పదాలు నాకు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. 


మనసు వెలితిగా ఉంటేనో, తనని వదిలి ఉండలేకపోతేనో, ఆకలి వెయ్యకపోతేనో, నిద్ర పట్టకపోతేనో,
మనసు బరువుగా ఉంటెనో ప్రేమలో ఉన్నట్టు కాదు,

ప్రేమ అనేది వీటన్నిటికి మించింది,
అదొక గొప్ప అనుభూతి,
అనుభవించనివారికి ప్రశ్నర్ధకం,
అనుభవించిన వారికి మధురానుభావం

ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే,

ప్రేమ మనకు సంబంధించినది
మన మనసుకి సంబంధించినది
మన మనసుకి మాత్రమే సంబంధించినది. 

ఎందుకంటే ప్రేమ, ఒకరు చెప్తే తెలుసుకునేదో, ఒకరు చూపిస్తే చూసేదో కాదు... 
మనకి మనం అనుభవించి తెలుసుకోవలసినది. 

కానీ ఇక్కడ మనకి మనం కొన్ని విషయాలు ఆలోచించగలిగితే, 
మనం ప్రేమలో ఉన్నామా 
అనే ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశముంది. 

అవేంటంటే,

ప్రేమించడం వేరు, ప్రేమించబడటం వేరు !!
ప్రేమలో ఉండటం వేరు, ప్రేమలో ఉన్నామనుకోవడం వేరు !!


ఎలా ఉంటె ప్రేమలో ఉన్నట్టో చాల సార్లు చూసాం, చాలా సందర్భాల్లో చదివాము,
అలంటి రచనల్లో ఇది ఒకటి కాకూడదనే ఇలా రాయటం జరిగింది.
సంతకం రచనలు కేవలం అభిప్రాయాలని వ్యక్తం చేసేవే కాకుండా,
పాఠకులలో ఒక చిన్న ఆలోచన రేకెత్తేలా ఉండాలనేదే నా ఆశ.

మనకి మనం ఆలోచించుకొని ప్రశ్నించుకుంటేనే,
మనకొక సమాధానం దొరుకుతుంది. 


ప్రేమను చూపించేది ప్రేమ కథ అయినప్పుడు,
ప్రేమ గురించి ఆలోచించేలా చేసేది కూడా ప్రేమ కథే అని నా అభిప్రాయం !!


ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.


ఈ రచన మీకు స్ఫూర్తినిస్తే షేర్ చేసి మరింతమందికి చేరేలా చెయ్యండి.

*** ***

ప్రేమకు నిర్వచనం చెప్పిన నవల


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక 




*********************************************************************************

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమనో బాధనో ఒకరికి తెలియచెప్పాలన్నా 

ఈ లింక్ క్లిక్ చేసి మాకు చెప్పండి 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాను.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.



________X ______