మనం ప్రేమించిన వారు మన ప్రేమను గుర్తించకుండా వెళ్ళిపోతే, భవిష్యత్తులో వారికి మన ప్రేమ విలువ తెలుస్తుందా?

మనం ప్రేమించిన వారు మన ప్రేమను గుర్తించకుండా వెళ్ళిపోతే, 
భవిష్యత్తులో వారికి మన ప్రేమ విలువ తెలుస్తుందా?

ప్రేమించడమనేది చాల గొప్పవిషయం.
ముందు అంత గొప్పవిషయాన్ని గుర్తించినందుకు మనల్ని మనం అభినందించుకుందాం. 

ఈ ప్రశ్నని నేను రెండు భాగాలుగా విడదీయాలనుకుంటున్నాను

మొదటిది:
మనం ప్రేమించాం. కానీ వారు గుర్తించలేదు.
గుర్తించకుండా వెళ్లిపోయారు !!

ప్రేమించడం వేరు
ప్రేమించబడటం వేరు 

అసలు ప్రేమించడం అంటే ఏంటో ముందు తెలుసుకుందాం

చిన్నప్పటినుండి మనకోసమే ఆలోచించిన మనం,
కొత్తగా ఇంకొకరి గురించి ఆలోచించడం
ప్రేమించడం

ఇన్నిరోజులూ నా ఆకలి గురించి ఆలోచించిన నేను,
కొత్తగా వేరొకరి ఆనందం గురించి ఆలోచించడం
ప్రేమించడం 

ఇన్నిరోజులూ నా సరదాల గురించి ఆలోచించిన నేను,
కొత్తగా వేరొకరి కోసం సమయం కేటాయించడం
ప్రేమించడం

అంటే, మనల్ని కాదనుకొని వేరొకరి కోసం ఆలోచించడం ప్రేమ అనేది నా భావం.

మనం అంతలా వారి గురించి ఆలోచిస్తున్నా,
గుర్తించలేని వారు చాలానే ఉంటారు, ఉన్నారు కూడా. 
వారు గుర్తించకపోడానికి కారణాలు చాలానే ఉండొచ్చు. అవన్నీ పక్కన పెడితే,

ఇక్కడొక చిన్న కథతో ఈ ప్రశ్నకి జవాబిస్తాను. 


కథ


రామ్ ఒకమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి నెమ్మదిగా చెప్పే క్రమంలో ఒక సమస్య వచ్చి పడింది. రామ్ ప్రేమను ఊహించని ఆ అమ్మాయి, సున్నితంగా తిరస్కరించింది. దానికి సంయమనం కోల్పోయిన రామ్, ఆ కోపం అణదొక్కుకొని ఇంటికి చేరాడు. 

అమ్మ అన్నం పెడుతూ, "ఎందుకు రా అలా ఉన్నావు?" అని అడిగింది. 
"ఏమి లేదు, అన్నం పెట్టు" అన్నాడు రామ్, భోజనానికి కూర్చుంటూ. 
"రామ్, బియ్యం నిండుకున్నాయిరా, సాయంత్రం షాపుకు వెళ్లి తీసుకొద్దాం" అన్నం పెడుతూ చెప్పింది అమ్మ.
"సరే అమ్మ" అంటూ తినడం మొదలుపెట్టాడు రామ్
"ఇంట్లో సరుకులు కూడా లేవురా, రేపు సూపర్ మార్కెట్ కి వెళ్లి తీసుకురా" అంది అమ్మ. 
అప్పటికే ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్న రామ్, ఒక్కసారి చిరాకుతో ప్లేట్ విసిరేసి, "అన్ని పనులు నేనే చెయ్యాలా? నాన్న లేరా, తమ్ముడు లేడా?" అంటూ గట్టిగా అరుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. 

అమ్మ దగ్గరనుండి ఫోన్ కాల్ వస్తూనే ఉంది. అయినా కట్ చేస్తూ, అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఒకదగ్గర కూర్చున్నాడు.

ఈ కథకి ముగింపు రాయకుండా మధ్యలోనే వదిలేస్తున్నాను. 
ఈ కథకు మీరిచ్చే ముగింపు పైనున్న ప్రశ్నకి సమాధానం చెపుతోందనే నమ్ముతున్నాను. 

రామ్ ప్రేమను గుర్తించలేక వెళ్లిపోయిన అమ్మాయి ఒకవైపు...
అమ్మ ప్రేమను గుర్తించక అమ్మాయి గురించి ఆలోచిస్తున్న రామ్ ఒకవైపు... 

అమ్మాయి గురించి ఆలోచిస్తూ, అమ్మ ప్రేమని గుర్తించక రామ్ తప్పు చేస్తున్నాడనుకుంటున్నారా?
తన ప్రేమను అమ్మాయికి ఎలాగైనా తెలిసొచ్చేలా చెయ్యాలని తపన పడటం కరెక్ట్ అనుకుంటున్నారా?


ఈ రెండు ప్రశ్నలకి మీరిచ్చే సమాధానం, 
మన రెండవ భాగానికి ఒక అర్ధం తీసుకొస్తుంది. 


భవిష్యత్తులో వారికి మన ప్రేమ విలువ తెలుస్తుందా?

అనే ప్రశ్నకి నా సమాధానం ఇది

మనం ప్రేమించాం, కాదని వెళ్లిపోయారు, అంతా బాగానే ఉంది. 

వీలైతే వారికి అర్ధమయ్యేలా మన ప్రేమని తెలియజెప్పడానికి ప్రయత్నించాలి. 
లేదంటే, కాలంతో పాటు కదలిపోవాలి

అంతేగాని, వారికి భవిష్యత్తులో మన ప్రేమ తెలుస్తుందా లేదా అని ఆలోచిస్తూ కూర్చోడం,
 అవివేకమని నా భావన. 

వారికి మన ప్రేమ తెలియనివ్వండి, తెలియనివ్వకపోండి

వెళ్లిపోయారు అంటేనే, 
తిరిగి వచ్చే పరిస్థితుల్లో లేరు అని అర్ధం. 

అలాంటప్పుడు, వారు భవిష్యత్తులో గుర్తిస్తారా? 
అని వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, 
మన వర్తమానంలో సమయాన్ని వృధా చేసుకోవడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. 


ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. 

పైనున్న కథకి మీ అభిప్రాయం, ఈ ప్రశ్నకి మీ జవాబు కమెంట్ సెక్షన్లో మాకు తెలపండి. 
నా అభిప్రాయం మీకు నచ్చినట్టయితే, ఈ పోస్ట్ షేర్ చేసి మరింత మందికి స్ఫూర్తినివ్వండి. 


*** ***

ప్రేమకు నిర్వచనం చెప్పిన నవల


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక 



*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమనో బాధనో ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాను.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.

*** ***