6.. 16... 26




6.... 16... 26

వయసులో మార్పు, ఆలోచనల్లో కూడా




ఒక ప్రయాణంలో ఎంతో మందిని కలుస్తూ ఉంటాం.
కొన్ని సరదా సన్నివేశాలు ఉంటె, కొన్ని ఆలోచింపజేసే సందర్భాలు కూడా ఉంటాయి.

అలా నా ప్రయాణాలలో ఆలోచించేలా చేసిన కొన్ని సందర్భాలలో ఇది ఒకటి.


విశాఖపట్నం - హైదరాబాద్
గోదావరి ఎక్ష్ప్రెస్స్


అప్పటివరకు ఏదో పుస్తకం చదువుతూ, అందులోనే నిమగ్నమైపోయిన నేను, కాస్త విరామం కోసం పుస్తకం పక్కన పెట్టి, నా పక్కనే కూర్చున్న వ్యక్తితో మాటలు కలిపాను. వివిధ అంశాలమీద మాట్లాడుకుంటున్న సమయంలో ఒక ఆరేళ్ళ పాప కిటికీ పక్కనే కూర్చుంటూ, బయటకి చూస్తూ ఆనందపడుతూ, తనలో తనే నవ్వుకుంటూ, మురిసిపోతూ, చెట్లని బిల్డింగులని చూస్తూ ఆస్వాదిస్తోంది.

అది చూసి, నా పెదాలమీదకి చిన్న చిరునవ్వు వచ్చేసింది. నిష్కల్మషంగా ఉన్న చిన్నపాటి ప్రపంచాన్ని తనకి తెలిసిన పద్ధతిలో అలా ఆనందించటం చూసి. చూపు మరల్చుకోవడమే కష్టమైంది. ఎలాగోలా చూపు తిప్పేసరికి, ఆ చిన్న పాపకి ఎదురుగానే కూర్చున్న ఒక పదహారేళ్ళ అమ్మాయి, ఫోన్ పట్టుకొని సినిమాలు చూస్తూ గేమ్స్ ఆడుకుంటూ, ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేసుకుంటూ కూర్చుంది.
అయినా అప్పుడప్పుడు భయటకి చూస్తూనే ఉంది.
కానీ తనకి అక్కడున్న చెట్లు, కొండలు, ప్రకృతి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి.
ఇంకేదో ఆనందం తన కళ్ళలో, పక్కనే ఉన్న ప్రకృతిని వదిలి, ఫోన్ తో ఆనందం పొందుతుంది.

అది చూసి, ఇటు వైపు తిరగగా నా ఎదురుగా కూర్చున్న ఇరవై ఆరేళ్ళ అమ్మాయి, భర్తతో ప్రయాణిస్తూ, అతని చేతిలో చెయ్యి పెట్టి భయటకి చూస్తూ ఆనందపదుతుండటం నేను గమనించాను.
తనకి తన భర్త కౌగిలి ఆనందాన్నిస్తుందనిపించింది.

ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.
అందరూ ఎవరి కిటికీ దగ్గర వారు కూర్చొని భయటకి చూస్తున్నారు.
చూస్తున్న ప్రకృతిలో మార్పు లేదు. కానీ వాళ్ళ ఆలోచనల్లో మార్పు స్పష్టంగా గమనించగలిగేదే.



ఇలానే మన జీవిత ప్రయాణంలో ఒక్కో సందర్భంలో ఆనందానికి అర్థం మారిపోతూ ఉంటుంది.
కనుక ఆనందాన్ని వెతుక్కునే వాడు ఎప్పుడు వెతుక్కునే ఉంటాడు.
ఉన్న దానితో ఆనందంగా బ్రతికే వాడు, ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు.