ఇదే'నా' స్వతంత్ర భారతం ?!


ఇదేనా స్వతంత్ర భారతం?
ఇదే నా స్వతంత్ర భారతం!


ప్రపంచపుటల్లో ఘన చరిత్ర కలిగిన నా స్వతంత్ర భారతం,

అదే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన నా స్వతంత్ర భారతం!

వలస వచ్చిన తెల్లదొరలకు వత్తాసు పలికిన నా స్వతంత్ర భారతం,
అదే తెల్లదొరలను దేశంనుండి తరిమికొట్టిన నా స్వతంత్ర భారతం!

గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం 
ప్రతి సంవత్సరం ఒక పండగలా తప్పక జరుపుకునే మనం,
తప్పు చేసిన వాడు ఎవడైనా, తప్పించుకోని రోజు వచ్చినప్పుడే మన గణతంత్రమని,
పక్కవాడు ఎవడైనా మనం భయపడకుండా బ్రతికే రోజు వచ్చినప్పుడే మన స్వతంత్రమని,
తెలుసుకోడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో?

'71వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో నిమగ్నమైపోయిన ప్రజలు'
'70 వసంతాలు పూర్తిచేసుకొని, 71వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న స్వతంత్ర భారతం'
'రాజధానిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు'
ఇలాంటి టీవీ హెడ్ లైన్స్ వస్తున్న చోటే, 

'నాసిరకం విత్తనాలు వాడి, పంటలు పండక రైతు ఆత్మహత్య'
'నాణ్యత ప్రమాణాలు లేని ప్రైవేట్ బస్సు బోల్తా, 30 మంది మృతి'
'లక్ష కోట్ల స్కాములో విచారణకి వెళ్లిన ప్రముఖ నాయకుడు, మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి'
లాంటి వార్తలు కూడా వింటూ ఉండటం మనం చేసుకున్న దౌర్భాగ్యం.

స్వతంత్ర దినోత్సవాన్ని పండగల భావిస్తున్నాం, వీధికో జెండా పెడుతున్నాం, 
కానీ అదే వీధిలో బ్రతుకుతున్న ప్రజల భాదలను పట్టించుకొం.
ఇదేనా స్వతంత్ర భారతం?

ఆగస్టు 15 ఒక సెలవు దినంగా చూస్తున్నాం, తెల్ల చొక్కా వేసుకొని జెండా వందనం చేస్తున్నాం, 
కానీ ఆ చొక్కా నేసిన చేసిన చేనేత కార్మికుడి ఆర్తనాదం వినిపించుకొం.
ఇదేనా స్వతంత్ర భారతం?

గుండెలలో ఉండాల్సిన మువ్వన్నెల పతాకాన్ని,
చొక్కా జేబు మీద ఒక సన్నటి పిన్నుతో గుచ్చుకొని, దేశభక్తిని ప్రదర్శిస్తున్నాం.
ఇదేనా స్వతంత్ర భారతం?

'జన గణ మన' అర్ధం తెలియకపోయినా పెదాలు కదుపుతున్నాం,
కానీ, అర్ధం చేసుకునే ప్రయత్నం మనలో ఎంత మంది చేస్తున్నాం?
ఇదేనా స్వతంత్ర భారతం?

ప్రజలని భయపెట్టే ప్రజా ప్రతినిధులు ఉంటున్న ఈ దేశంలో,
రోడ్ మీద బండి ఆపి, చేతులు జేబులో పెట్టుకునే పొలిసులు ఉంటున్న ఇదే దేశంలో,
'అధికారం ఉన్న చేతుల్లోనే స్వతంత్రం ఉంటుంది' 
అనే ఈ వాక్యం అతిశయోక్తి కాకపోవచ్చు 

స్వతంత్రం తెచ్చి, శ్వాస విడిచిన వాళ్ళు నాయకుల?
అధికారంతో ప్రజలని భయపెట్టేవాళ్ళు నాయకుల?

మనకు మనమే ఆలోచించుకుందాం 

71వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.